Manmohan Singh: దేశం ఒక ఆర్థిక వేత్తను కోల్పోయింది..

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక, మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరు అని కోనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీ రోల్ పోషించారని.. ఆయన చేసిన సేవ, ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా ఘన నివాళులర్పిస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగఢా సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వెల్లడించారు.
అయితే, భారత్ విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండే ఆర్థికవేత్తగా ఎదిగారని చెప్పుకొచ్చారు. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా తనదైన ముద్ర వేశారని కోనియాడారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు ఎంతో గొప్పగా ఉండేవి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా, నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అనేక విషయాలపై తరుచూ మాట్లాడుకునే వాళ్లమన్నారు. పాలనకు సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఆయన జ్ఞానం, వినయం, ఆలోచనలన్నీ దేశానికి సేవ చేయడం కోసమే ఉపయోగించారని ప్రధాని మోడీ చెప్పారు.
కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. ఇక, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని వేడుకుంటున్నాను అని అమిత్ షా వేడుకున్నారు. అలాగే, దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. వ్యక్తిగతంగా నాకు ఆయన ఎంతో ఆత్మీయులు.. వారి నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శమైనవి అని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ తెలియజేస్తున్నాను అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com