Chhattisgarh CM: చత్తీస్ గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయ్..

Chhattisgarh CM: చత్తీస్ గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయ్..
మాజీ సీఎంను కాదని బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం..

ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్‌ సాయ్‌ను భాజపా ఎంపిక చేసింది. రాయ్‌పుర్‌లో సమావేశమైన 54 మంది భాజపా ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా విష్ణుదేవ్‌ సాయ్‌ను ఎన్నుకున్నారు. గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ వీడింది. గిరిజన నాయకుడు విష్ణుదేవ్‌ సాయ్‌ను నూతనంగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ నాలుగో ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్ త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. విష్ణుదేవ్‌ సాయ్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పెద్ద నాయకుడిని చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కున్‌కురి బహిరంగ సభలో ప్రజలకు హామీనిచ్చారు. అందుకు అనుగుణంగానే విష్ణుదేవ్‌ సాయ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. భాజపా ఛత్తీస్‌గఢ్‌ అధ్యక్షుడిగా విష్ణుదేవ్‌ సాయ్‌ పలు పర్యాయాలు పనిచేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. నాలుగు సార్లు రాయ్‌గఢ్‌ నుంచి ఎంపీగా గెలిచిన విష్ణుదేవ్‌....2023 అసెంబ్లీ ఎన్నికల్లో కున్‌కురి నియోజకవర్గం నుంచి 25 వేల 541 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు సన్నిహితుడిగా విష్ణుదేవ్‌ సాయ్‌కి పేరుంది. రమణ్‌సింగ్‌ కూడా ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని మెుదలు పెట్టిన విష్ణుదేవ్‌ సాయ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీ, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో జాష్పుర్ జిల్లాలోని కుంకురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 25 వేల 541 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విష్ణుదేవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గిరిజనులు ఎక్కువగా ఉండే సర్గుజా ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలోని 14 అసెంబ్లీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. విష్ణు ప్రాతినిథ్యం వహిస్తున్న జాష్పుర్ జిల్లా ఝార్ఖండ్‌, ఒడిశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని ఆదివాసీల మన్ననలు, విశ్వాసాన్ని చూరగొనేందుకు భాజపా అగ్రనాయకత్వం విష్ణును ఎంపిక చేసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

భాజపా శాసనసభపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యేలంతా పూలదండలతో విష్ణుదేవ్‌ సాయ్‌ను సత్కరించారు. అనంతరం గవర్నర్‌ నివాసానికి చేరుకున్న విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు

Tags

Next Story