Dharmendra Pradhan : నెట్, నీట్ పేపర్ లీక్ లపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ, నీట్ అవకతవకలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరును సమీక్షించేందుకు, మెరుగుపరిచేందుకు ఉన్నత స్థాయి ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యూటీసీ నెట్ తరహాలోనే నీట్‌ను సైతం రద్దు చేయాలని కేంద్రం భావిస్తుందా? అని ప్రశ్నించగా.. పరీక్షల నిర్వహణే తమ తొలి ప్రాధాన్యం అన్నారు. అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదన్నారు.
పరీక్షల్లో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితమని.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులపై ఆ ప్రభావం ఉండదన్నారు. ఎన్టీఏ అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మన వ్యవస్థలపై విశ్వాసం ఉంచుదామన్న ఆయన.. ప్రభుత్వం ఎలాంటి అక్రమాలు, అవకతవకలను సహించదని స్పష్టం చేశారు. సమస్యను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం ఎన్‌టీఏ నిర్వహించిన నీట్ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది.
సుమారు 24లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇటీవల ఫలితాలు వెలువడగా.. 67 మంది విద్యార్థులు 720 స్కోర్ సాధించారు. టాప్ స్కోర్‌లో ఆరుగురు హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒకే సెంటర్‌కు చెందిన వారున్నారు. నీట్ ప్రవేశ పరీక్షల పేపర్ లీక్ ఆరోపణలను కేంద్రమంత్రి తిరస్కరించారు. దానికి ఆధారాలు లేవన్నారు. ఎన్‌టీఏలో అవినీతి ఆరోపణలు నిరాధారమైవన్నారు. యూసీటీ నెట్ రద్దుపై కేంద్రమంత్రి స్పందిస్తూ నెట్ పేపర్ లీక్‌కావడంతో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలనే నిబద్ధతతో ఉన్నామని.. వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com