Rajasthan School Collapse: పాఠశాల పైకప్పు కూలి నలుగురు విద్యార్థుల మృతి

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఈ ఉదయం ఒక ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో నలుగురు చిన్నారులు మరణించగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలు తరగతులకు హాజరవుతున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పిప్లోడి ప్రాథమిక పాఠశాలలో భవనం కూలిన వెంటనే పోలీసులు, స్థానికులు, అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. "నలుగురు విద్యార్థులు మరణించారు. 17 మంది గాయపడ్డారు. పదిమంది చిన్నారులను ఝలావర్‌లోని ఆసుపత్రికి తరలించారు" అని అధికారులు తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఇది ఒక విషాదకర ఘటన’ అని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి విచారణకు హామీ ఇచ్చారు. గాయపడిన పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారి చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. పైకప్పు కూలిపోవడానికి గల కారణాలను నిర్ధారించడానికి ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ ఘటనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్రాణనష్టం తక్కువగా ఉండాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఝాలావర్, సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్లే పాఠశాల పైకప్పు కూలిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com