Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై షూస్ విసిరిన కేఎస్‌యూ కార్యకర్తలు

కొత్తమంగళంలో జరిగిన నవ కేరళ సదస్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్‌పై కేఎస్‌యూ కార్యకర్తలు షూస్ విసిరి నిరసన తెలిపారు ఈ సంఘటనకు పాల్పడిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అధికార సీపీఎం విద్యార్థి విభాగం కార్యకర్తలు, కేఎస్‌యూ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో కొందరు గాయపడ్డారు.
కాగా, కేరళ సీఎం విజయన్ ఈ సంఘటనపై స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడుతుందని హెచ్చరించారు. అప్పుడు ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. నిరసనకారులు ఇలాంటి చర్యల ద్వారా హింసా మార్గాన్ని ఎంచుకుంటున్నారని మండిపడ్డారు. ఆందోళనలు ఇలాగే కొనసాగి కార్యక్రమాల్లో, బస్సులపై చెప్పులు, రాళ్లు విసిరేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవ కేరళ సదస్ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న స్పందన చూస్తుంటే వీటి అవసరం ఏంటన్నది అర్థమవుతోందని అన్నారు. అయితే, ఇది కొంతమందికి సమస్యగా మారుతోందని, వారి ఇబ్బందికి కారణమేంటో తమకు తెలియదని పేర్కొన్నారు. అయితే, వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పినరయి విజయన్ హెచ్చరించారు.
మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ తన మంత్రివర్గంతో కలిసి 140 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర ప్రారంభించారు. అయితే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కనమ్ రాజేంద్ర మృతితో ప్రభుత్వం పలు కార్యక్రమాలను రద్దు చేసింది. కార్యక్రమాలు తిరిగి ప్రారంభమైన తరువాత కాన్వాయ్‌పై దాడి జరిగింది. ‘నవ కేరళ సదస్సు’ పేరుతో మంజేశ్వరం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర డిసెంబర్ 24న రాజధాని తిరువనంతపురంలో ముగుస్తుంది. అయితే విలాసవంతమైన బస్సు యాత్రపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ మండిపడ్డాయి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com