Manipur: మరోసారి భయాందోళనలు

మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అల్లరిమూకలు అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. అల్లర్లలో మృతిచెందిన కుకీల సామూహిక ఖననం సందర్భంగా అల్లర్లు ఎగిసిపడ్డాయి. సామూహిక ఖననం కార్యక్రమం జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన కుకీలు, ఆర్మీ బలగాల మధ్య వాగ్వాదం జరిగింది. కుకీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు బలగాలు ప్రయత్నించగా కుకీలు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆర్మీ, ఆర్‌ఏఎఫ్ బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. ఈ ఘటనలో సుమారు 25 మందికి గాయాలయ్యాయి. సామూహిక ఖననాన్ని అడ్డుకునేందుకు చురాచాంద్‌పూర్ వైపు వందలాదిగా కదిలిన మైతీలు బిష్ణుపూర్ జిల్లా నరన్‌సెయినలోని రెండో భారత రిజర్వు బెటాలియన్ కేంద్ర కార్యాలయంపై అల్లరిమూక దాడి చేసి భారీగా ఆయుధాలను లూటీ చేశారు.
ఏకంగా 19వేల రౌండ్లకు పైగా తూటాలను దుండగులు దోచుకెళ్లారు. వీటితో పాటు AK సిరీస్ అసాల్ట్ రైఫిల్, 3 ఘాటక్ రైఫిల్స్, 195 సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్, ఐదు MP-ఫైవ్ తుపాకులు, 16.. నైన్ mm పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్లు, 124 హ్యాండ్ గ్రెనేడ్లను అల్లరి మూకలు ఎత్తుకెళ్లాయి. వీటితో భారీ దాడులకు తెగబడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులుఆయుధాలు లూటీ చేసిన వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మైతేయ్ తెగకు చెందిన కొందరు వ్యక్తులు చురచంద్‌పూర్ వైపు వెళ్లేందుకు యత్నించడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్ తూర్పు పశ్చిమ జిల్లాల్లో సామాన్యులు నిత్యావసరాలు కొనేందుకు 7 గంటలు కర్ఫ్యూను సడలించారు. కాగా.. ఈ నెల 21న అసెంబ్లీని సమావేశ పరచాలని మణిపుర్ గవర్నర్ అనసూయ ఉయికేకు రాష్ట్ర కేబినేట్ సిఫార్సు చేసింది.
మణిపుర్‌లో జాతుల మధ్య రిజర్వేషన్ రేపిన కార్చిచ్చులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ గొడవల్లో ఇప్పటి వరకు 6 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. నమోదైన కేసుల్లో ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం, నాశనం చేయడం వంటివే ఎక్కువగా ఉన్నాయి. మహిళల ఊరేగింపు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశం మొత్తం ఆగ్రహావేశాలు పెల్లుబిక్కాయి.
ప్రభుత్వ సంస్థలు, భద్రతా బలగాలు మణిపుర్‌లోని అన్ని సంఘటనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్ సహా సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com