MANIPUR: మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస

ఇరు వర్గాల ఘర్షణలతో మొన్నటి వరకూ అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కాంగ్‌పోక్పి జిల్లాలో పోలీసుల కాల్పుల్లో మరణించిన వ్యక్తిని ఇంఫాల్ తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. కర్ప్యూ నిషేధాజ్ఞలను పక్కనపెట్టి మృతదేహం వద్ద భారీగా ఆందోళనకారులు పోగయ్యారు. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. మృతదేహాన్ని ముఖ్యమంత్రి నివాసానికి ఊరేగింపుగా తీసుకెళ్తామని నిరసనకారులు హెచ్చరించడంతో కలకలం రేగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టి మృతదేహాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని మార్చురీకి తరలించారు.
కాంగ్‌పోక్పి జిల్లాలో సాయుధులు కాల్పులు జరిపారని భారత సైన్యం తెలిపింది. దీనికి ప్రతిస్పందనగా, పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండటానికి సమీపంలోని సైన్యాన్ని మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్మీ స్థావరాలపై కూడా కాల్పులు జరిగాయి. ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం పకడ్బందీగా స్పందించిందని అధికారిక ప్రకటనలో మణిపుర్ ప్రభుత్వం తెలిపింది. ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరన్‌బంద్ బజార్‌లో గుమిగూడిన గుంపును చెదరగొట్టేందుకు కూడా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంపైనా ఆందోళనకారులు దాడి చేశారు. ఇదే జిల్లాలో గురువారం ఉదయం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
గురువారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేపట్టిన మణిపూర్ పర్యటన కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్‌లో కాన్వాయ్‌ను పోలీసులు గంటల పాటు నిలిపేశారు. రాహుల్ పర్యటనకు అనుకూలంగా, ప్రతికూలంగా కొందరు నినాదాలు చేయడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం రాహుల్ మణిపుర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చురాచంద్‌పుర్ చేరుకుని అల్లర్ల బాధితులను పరామర్శించారు. రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై కాంగ్రెస్-భాజపా మధ్య మాటల యుద్ధం చెలరేగింది. మే 3న మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితిపై ప్రతిపక్షాలు నిరంతరం ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. విపక్షాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. గత నెలరోజులుగా మణిపుర్‌లో చెలరేగిన హింసలో తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. సుమారు 100 ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com