లాయర్ నుండి రాజకీయవేత్త వరకు.. సీఎం సిద్దరామయ్య రాజకీయ ప్రస్థానం..

లాయర్ నుండి రాజకీయవేత్త వరకు.. సీఎం సిద్దరామయ్య రాజకీయ ప్రస్థానం..
కర్నాటకకు కొత్త ముఖ్యమంత్రిగా కాబోతున్న సిద్ధరామయ్య అట్టడుగు స్థాయి మద్దతు ఉన్న నాయకుడు.

కర్నాటకకు కొత్త ముఖ్యమంత్రిగా కాబోతున్న సిద్ధరామయ్య అట్టడుగు స్థాయి మద్దతు ఉన్న నాయకుడు. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సిద్ధరామయ్య 1970 నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం, పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు లభించడంతో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి కాగలిగారు.

ఉత్కంఠ, అనిశ్చితికి తెరదించుతూ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్యను , ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. మే 10న జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత అత్యున్నత పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది .

సిద్ధరామయ్యను రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అర్ధరాత్రి తర్వాత నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది. పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత అంతిమంగా హైకమాండ్ నుంచి మద్దతు సిద్ధరామయ్యకే లభించింది. 75 ఏళ్ల సీనియర్ నాయకుడు మే 20న బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని పార్టీ జనతాదళ్ (సెక్యులర్) సభ్యుడిగా ఉన్న సిద్ధరామయ్య 2006లో బహిష్కరించబడిన తర్వాత అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. 2013లో, 224 సీట్లలో 122 కైవసం చేసుకుని కాంగ్రెస్ మెజారిటీ సాధించడంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నందున, ఆయన జీవితం మరియు రాజకీయ ప్రయాణం గురించి..

లాయర్ నుండి రాజకీయవేత్త వరకు

సిద్ధరామయ్య మైసూరు జిల్లాలోని సిద్దరామనహుండి అనే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. అతను మైసూర్ విశ్వవిద్యాలయం నుండి B.Sc పట్టభద్రుడయ్యాడు అక్కడే న్యాయవిద్యను అభ్యసించి కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు.

కురుబా (గొర్రెల కాపరుల సంఘం) ఉత్తర కర్ణాటకలో వెనుకబడిన కుల సమూహం నుంచి వచ్చిన సిద్ధరామయ్య పార్వతి అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు -- పెద్ద కుమారుడు రాకేష్ కాంగ్రెస్‌వాది, మరో కుమారుడు యతీంద్ర వైద్యుడు. 2016లో పెద్దకుమారుడు రాకేష్ మరణించాడు.

కర్నాటకలో పంచాయితీ రాజ్‌ను తీసుకురావడం, గ్రామాలకు తాగునీటిని అందించడంలో ప్రసిద్ధి చెందిన అబ్దుల్ నజీర్ సాబ్‌ను సిద్దరామయ్య తన రాజకీయ గురువుగా భావించారు.

అబ్దుల్ నజీర్ సాబ్ సలహా మేరకు 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. చాముండేశ్వరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తరువాత ఆ స్థానం అతనికి బలమైన కోటగా మారింది.

సిద్ధరామయ్య ఎన్నికల్లో విజయం సాధించి, జనతా పార్టీ రామకృష్ణ హెగ్డే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే స్పందిస్తూ 1983లో కన్నడను కర్ణాటక అధికార భాషగా చేసేందుకు ఏర్పాటైన కమిటీకి ఆయన్ను చైర్మన్‌గా నియమించారు.

1985 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసిన సిద్ధరామయ్య రాష్ట్ర మంత్రివర్గంలో సెరికల్చర్, పశుపోషణ, రవాణాతో సహా వివిధ శాఖలను ఆయన నిర్వహించారు.

అయితే, 1989లో, సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ఎం రాజశేఖర మూర్తి చేతిలో ఓడిపోయారు. 1992లో జనతాదళ్ సెక్రటరీ జనరల్ అయ్యారు.

1994లో, సిద్దరామయ్య మళ్లీ చాముండేశ్వరి స్థానం నుండి ఎన్నికయ్యారు. హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1996లో జేహెచ్ పటేల్ అత్యున్నత పదవిని చేపట్టడంతో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

1996లో జనతాదళ్ చీలిపోయి దేవెగౌడ నేతృత్వంలోని జెడి(ఎస్) వర్గానికి సిద్ధరామయ్య అధ్యక్షుడయ్యారు. 1999లో చాముండేశ్వరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఏఎస్‌ గురుస్వామిపై మళ్లీ ఓడిపోయారు.2004 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ జేడీ(ఎస్)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

అహిందా (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు మరియు దళితుల సంఘం) అనే అపోలిటికల్ ఫోరమ్‌ను ప్రారంభించి రాష్ట్రంలో పర్యటించారు. దీంతో ఆగ్రహించిన హెచ్‌డి దేవెగౌడ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని కోరారు. వెనుకబడిన తరగతుల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించిన నేపథ్యంలో సిద్ధరామయ్య 2006లో జేడీ(ఎస్) నుంచి వైదొలిగి కాంగ్రెస్‌లో చేరారు.

అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఆయన గెలుపొందారు. 2008లో వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొత్తం మీద ఐదోసారి మళ్లీ ఎన్నికయ్యారు. కర్నాటకలో బీజేపీ తొలిసారిగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు.

సీఎం సిద్దరామయ్య

ఎట్టకేలకు 2013లో సిద్ధరామయ్యకు సీఎం అవ్వాలన్న తన కల నెరవేరింది. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2013 నుండి 2018 వరకు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పదవీకాలం విజయాలతో పాటు వివాదాలూ మూట కట్టుకున్నారు.

సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించాలనే లక్ష్యంతో అత్యంత ప్రశంసలు పొందిన 'అన్న భాగ్య' కార్యక్రమంతో సహా అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, అతని పదవీకాలం విమర్శలు ఎదుర్కున్నారు.

సిద్దరామయ్య నేతృత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకుంది. సిద్ధరామయ్య తన కంచుకోట అయిన చాముండేశ్వరి, బాదామి రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. చాముండేశ్వరిలో ఓడిపోయినా బాదామి నుంచి గెలిచారు. బీజేపీ హయాంలో సిద్ధరామయ్య ప్రతిపక్ష నేతగా పనిచేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రచారం.. స్వతహాగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సిద్ధరామయ్య ప్రతి రైతుకు 3 శాతం వడ్డీ రేటుతో రూ. 20 లక్షల రుణ సాయాన్ని రైతులకు ప్రకటించారు. తద్వారా అతడికి రైతుల నుంచి బలమైన మద్దతు లభించింది. గడచిన 34 ఏళ్లలో ఏ పార్టీకీ రాని అత్యధిక ఓట్లను సాధించి చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్‌ కష్టానికి ఫలితం దక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో, ఆ పార్టీ 135 స్థానాలను గెలుచుకుంది 42.88 శాతం ఓట్లను సాధించింది. 1989 తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన అతిపెద్ద విజయంగా పేర్కొంది.

ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్యకా లేదా డికె శివకుమార్ కా అని మల్లగుల్లాలు జరిపి చివరకు సిద్ధూని సీఎం చేసింది. అంతిమంగా, పార్టీ అధిష్టానానికి పలువురు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో సిద్ధరామయ్యకు మరోసారి సీఎం సీట్లో కూర్చునే అవకాశం లభించింది.

Tags

Next Story