Air India crash: ఇంధన స్విచ్‌ల వ్యవహారం.. ‘డీజీసీఏ’ కీలక ఆదేశాలు

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’పై అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇంధన స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారినట్లు నిర్ధారణ అయింది. దీంతోనే ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై లోతైన విచారణ జరుగుతోంది.
దీంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్లో ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’లను తనిఖీ చేయాలని అన్ని ఎయిర్‌లైన్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇదే కాకుండా ఎయిర్ వర్తీనెస్ ఆదేశాలకు అనుగుణంగా విమానం ఇంజన్లు, భాగాలకు సంబంధించిన తప్పనిసరిగా మార్పులకు గురి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాలను ఎయిర్ ఇండియా, ఇండిగో నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా, ఈ ఆదేశాలు బోయింగ్ 737, 787 డ్రీమ్‌లైనర్ సిరీస్‌లతో సహా బోయింగ్ కంపెనీ మోడళ్లకు సంబంధించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందినది. విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయి 270 మంది మరణించారు. టేకాఫ్ సమయంలో ఇంధన స్విచ్‌లు సెకన్లలోపే ఆఫ్ అయిపోయాయి. దీంతోనే ఈ ఆదేశాలను డీజీసీఏ జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com