Vijay Mallya: నేను భారత్‌కు రాలేనేమో .. ఎందుకంటే!:

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాను భారత్‌కు తిరిగి రాలేనని బాంబే హైకోర్టుకు తెలియజేశారు. తాను భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని అన్నారు. తాను బ్రిటన్ దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందుకే ఎప్పుడు తిరిగి వచ్చేది చెప్పలేనని తెలిపారు.
ఈ మేరకు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ బాంబే కోర్టులో ఒక స్టేట్‌మెంట్‌ను సమర్పించారు. మాల్యా దగ్గర యాక్టివ్ ఇండియన్ పాస్‌పోర్టు లేదని, అదేవిధంగా దేశం దాటి వెళ్లకుండా ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల ఆంక్షలు ఉన్నాయని కోర్టుకు సమర్పించిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం గత వారం విజయ్ మాల్యా పిటిషన్‌పై విచారణ జరపడానికి నిరాకరించింది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. అయితే మాల్యా భారత్‌కు రాకుండా ఈ పిటిషన్‌పై విచారణ జరపలేమని స్పష్టం చేసింది. మాల్యాకు భారత్‌కు తిరిగొచ్చే ఉద్దేశం ఉందా, లేదా? అని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో మాల్యా తన తరఫు న్యాయవాది ద్వారా బాంబే హైకోర్టులో తాజా స్టేట్‌మెంట్‌ను సమర్పించారు. ఈ పిటిషన్ విచారణ జరిపేందుకు ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ అమిత్ దేశాయ్ కోర్టులో వాదనలు వినిపించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
