AYODHYA: భద్రతా వలయంలోకి అయోధ్య

AYODHYA: భద్రతా వలయంలోకి అయోధ్య
అడుగడుగునా డేగ కళ్లతో నిఘా... వెయ్యి సీసీ కెమెరాలతో అణువణువూ జల్లెడ

రామమందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన వేళ అయోధ్య బహుళ స్థాయి భద్రతా వలయంలోకి వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ATS కమాండోలు, పోలీసులతో పాటు భారీగా CRPF దళాలను నగరంలో మోహరించాయి. యాంటీ డ్రోన్ జామర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనే శక్తి ఉన్న NDRF బృందాలను అయోధ్యకు రప్పించారు. అయోధ్యకు దారితీసే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక రీడర్ కోడ్‌తో సరిపోలితేనే... లోపలికి అనుమతి ఇస్తున్నారు. QR కోడ్ తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ, విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.


బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైన వేళ అయోధ్య..... భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీస్ విభాగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను మోహరించారు. సాధారణ దుస్తులు ధరించిన పలువురు పోలీసులు ప్రజల్లో కలిసిపోయి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ పోలీసులకు రెండు, అంతకంటే ఎక్కువ భాషలు వచ్చని అధికారులు తెలిపారు. అయోధ్యలో వెయ్యికిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అణువణువూ జల్లెడ పడుతున్నారు. మరింత నిఘా కోసం కొన్ని సీసీ కెమెరాల్లో కృత్రిమ మేథ-A.Iను వినియోగించినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ జామర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనే శక్తి ఉన్న NDRF బృందాలను అయోధ్యకు రప్పించారు. ఈ బృందాలు... రసాయన, అణు దాడులు, భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా శిక్షణ పొందారని అధికారులు తెలిపారు.


మరోవైపు సరయూ నది వెంబడి NDRF, SDRF బృందాల సహాయంతో భద్రతను పెంచినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story