G20 Security : శత్రుదుర్భేద్యంగా ఢిల్లీ గగనతలం..

G20 Security : శత్రుదుర్భేద్యంగా ఢిల్లీ  గగనతలం..
గగనతలంపై రఫేల్‌, మిరాజ్-2000, సుఖోయ్-30MKI యుద్ధ విమానాలు

దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సదస్సు కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచదేశాధినేతల మధ్య జరిగే ఈ భేటీ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. రక్షణ నిమిత్తం భద్రతా బలగాలతో పాటు సరికొత్త సాంకేతికతలను మోహరించారు. చీమ చిటుకుమన్నా గుర్తించేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. గగనతలాన్నిశత్రు దుర్భేద్యంగా మార్చారు. లక్షా 30 వేల మంది భద్రతా సిబ్బంది యుద్ధ విమానాలు రాడార్లు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు వందలాది డ్రోన్లు వేలాది సీసీ కెమెరాలు కఠిన ఆంక్షలు యుద్ధానికి సన్నాహాలా అన్నట్టు సిద్ధం అవుతున్నారు.


జీ 20 సదస్సు జరగనున్న వేళ దేశ రాజధాని ఢిల్లీ లోకనివినీ ఎరుగని పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. చీమ చిటుకుమన్నా పసిగట్టేలా ఆకాశంలో అనుమానాస్పదంగా ఏదీ కనిపించినా వెంటనే నేలమట్టం చేసేలా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భద్రతా సిబ్బంది వేలాది సీసీ కెమెరాలు వందలాది డ్రోన్లు పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను మోహరించారు. ప్రపంచ దేశాధినేతలు తరలిరానున్న వేళ వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భద్రత కోసం దిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సమావేశాలు జరిగే వేదికల వద్ద రక్షణ కోసం కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు సాఫ్ట్‌వేర్ అలారాలు, డ్రోన్లు పహారా కాయనున్నాయి. అదనపు భద్రత కోసం ఎత్తైన భవనాల వద్ద NSG కమాండోలు, ఆర్మీ స్నైపర్లను మోహరించారు.


అనుమానాస్పద డ్రోన్ల కూల్చివేతకు న్సగ్ భారత వైమానిక దళం, ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోనుంది. ఢిల్లీ గగనతలంపై రఫేల్‌, మిరాజ్-2000, సుఖోయ్-30MKI యుద్ధ విమానాలనుమోహరించనున్నారు. భద్రతా ఏర్పాట్లపై అన్ని భద్రతా సంస్థలతో సమన్వయం చేసేందుకు వాయుసేన ప్రత్యేక ఆపరేషన్స్ డైరెక్షన్ సెంటర్‌ని ఏర్పాటు చేసింది. జీ 20 సదస్సుకు హాజరయ్యే విదేశీ అతిథుల భద్రత కోసం120 వాహనాలను సీఆర్పీఎఫ్‌కు అందజేశారు. వీటిలో 45 బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్లున్నాయి. వీటిని ప్రత్యేకంగా పలు దేశాల అధ్యక్షుల రక్షణకు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ తెలిపింది. లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్‌ ఉన్న వీఐపీ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్లు నడిపేందుకు 450 మంది సీఆర్పీఎఫ్‌ డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story