G20 MEET: నేటి నుంచే అగ్రదేశాధినేతల రాక

G20 MEET: నేటి నుంచే అగ్రదేశాధినేతల రాక
జీ 20 సదస్సుకు తరలిరానున్న దేశాధినేతలు... పకడ్బంధీ ఏర్పాట్లు... భారీగా అజెండా...

దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి జీ20 సందడి మరింత పెరగనుంది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు నేటి నుంచి అగ్రదేశ అధినేతలు ఢిల్లీకి రానున్నారు. దేశాధినేతలకు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భారత్‌ చేరుకోనున్నారు. సునాక్‌కు కేంద్ర సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. సునాక్‌ షంగ్రి-లా హోటల్‌లో బసచేయనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రానున్నారు.


అగ్రదేశాధినేతల రాక దృష్ట్యా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ దాడులను తిప్పి కొట్టే కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ను దిల్లీకి రప్పించారు. డమ్మీ పేలుడు పదార్థాలపై శునకాలతో డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అటు యమునా నదిలోనూ పోలీసులు పడవలతో పెట్రోలింగ్ చేపట్టారు. ట్రాఫిక్‌, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు సుమారు 40 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. కర్తవ్యపథ్‌, ఇండియా గేట్‌ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించారు. జీ-20 నేతల రక్షణలో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించేందుకు యాంటీ-సాబోటేజ్ డ్రిల్స్‌ను భద్రతా దళాలు నిర్వహించాయి. డమ్మీ బాంబులపై పోలీసు జాగిలాలతో డ్రిల్స్ చేశాయి. నగరంలోని ప్రతీ ప్రాంతంపై నిఘా కోసం దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ -NDMC ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.


జీ20 కూటమిలోని సభ్యదేశాలతో పాటు 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు కూడా సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ రానున్నారు. రేపు(శనివారం) నుంచి జరగనున్న శిఖరాగ్ర సదస్సు ముందు భారీ అజెండానే ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్‌ డెవలప్‌మెంట్‌, వాతావరణ మార్పులు వంటి అంశాలపై సదస్సు దృష్టిసారించనుంది. ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పేద దేశాలను ఆదుకోవడానికి, అభివృద్ధి కొనసాగడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి బ్యాంకులను సంస్కరించి, బలోపేతం చేయాలని జీ-20 కూటమి భావిస్తోంది. విశాల హృదయంతో ఈ బ్యాంకుల ద్వారా పేద దేశాలకు రుణాలు, ఇతర సాయం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనల కోసం భారీగా నిధులు సమకూర్చడంపై జీ-20 సదస్సులో అంగీకారం కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బ్యాంకులను ఎలా సంస్కరించాలి.., రుణాలను ఎలా అందించాలో నిర్దేశించడానికి ఓ అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story