G20 MEET: నేటి నుంచే జీ 20... విచ్చేసిన దేశాధినేతలు

G20 MEET: నేటి నుంచే జీ 20... విచ్చేసిన దేశాధినేతలు
జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధం... కీలక అంశాలపై నేటి నుంచి దేశాధినేతల చర్చలు...

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సు నేడు ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో సదస్సు జరగనుంది. సదస్సుకు భారత్‌ కనీవినీ ఎరుగని ఏర్పాటు చేసింది. జీ20 సభ్యదేశాలతోపాటు బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్‌ దేశాధినేతలు కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత్‌కు తరలివచ్చారు. జీ20 సదస్సులో పాల్గొనే అతిరథుల్లో చాలా మంది ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి భారత్‌లో అడుగుపెట్టారు. సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే స్వాగతం పలికారు.


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం సాయంత్రం భారత్‌లో అడుగుపెట్టారు. ఆయనకు కేంద్రమంత్రి వీకే సింగ్‌ ఘన స్వాగతం పలికారు. సతీమణి జిల్‌ బైడెన్‌కు కరోనా సోకడంతో బైడెన్ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. ఇటలీ, యూఏఈ, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాధినేతలు దిల్లీ చేరుకున్నారు. ప్రపంచ నేతలకు విమానాశ్రయం వద్ద సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.


భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుపై....భారీ అంచనాలే ఉన్నాయి. సమ్మిళిత వృద్ధి, డిజిటల్‌ ఆవిష్కరణ, వాతావరణ మార్పులు, అందరికీ సమాన ఆరోగ్య అవకాశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్థిక నేరస్థులు ఏ దేశంలో ఉన్నా వారిని కట్టడి చేయడం, అప్పగించడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ఒప్పందానికి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని జీ-20 సభ్యదేశాలపై భారత్‌ ఒత్తిడి చేయనుంది. దక్షిణార్ధ గోళ దేశాల ఆందోళనలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా దారుణ పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపే దిశగా చర్చలు జరగనున్నాయి. సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై సదస్సు దృష్టిసారించనుంది. చైనా, రష్యా అమెరికాతో విభేదిస్తున్న వేళ సదస్సులో డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత్‌ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.


జీ 20 శిఖరాగ్ర సదస్సు మానవ కేంద్రీకృత, సమ్మిళిత అభివృద్ధిలో కొత్త మార్గాన్ని రూపొందిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సదస్సు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు మోదీ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వెనుకబడిన వారికి వరుసలో నిల్చున్న చివరి వ్యక్తికి సేవ చేయాలనే విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యమని ప్రధాని అన్నారు. అభివృద్ధి మానవ కేంద్రీకృతంగా ఉండాలన్నదే భారత విధానమని స్పష్టం చేశారు. సుస్థిర భవిష్యత్తు కోసం సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు, గ్రీన్ డెవలప్ మెంట్ ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే G20 అధ్యక్ష థీమ్ ..... ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అనే దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story