G-20 Summit: డిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

వచ్చే నెలలో జీ-20 శిఖరాగ్ర సదస్సుకు డిల్లీఆతిథ్యమివ్వనుండటంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని సహా వివిధ దేశాధినేతలు వస్తుండటంతో హస్తినలో అణువణువూ జల్లెడపడుతున్నారు. చీమ చిటుక్కుమన్నా పసిగట్టేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరికరాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌జీ, ఆర్మీ స్నైపర్లు, సీఆర్పీఎఫ్, దిల్లీ పోలీసులను హోటళ్లు, విమానాశ్రయం, సదస్సు జరిగే ప్రాంగణం వద్ద మోహరించారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ భద్రతా ఏర్పాట్లను పలుమార్లు సమీక్షించింది.
సమావేశాలు జరిగే వేదికల వద్ద రక్షణ కోసం కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు, సాఫ్ట్‌వేర్ అలారాలు, డ్రోన్లు పహారా కాయనున్నాయి. గోడలు ఎక్కడం, పరిగెత్తడం వంటి చర్యలతో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. ఏఐ కెమెరాలు వెంటనే భద్రతా బలగాలను అప్రమత్తం చేస్తాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అనుమానాస్పద డ్రోన్లను కూల్చివేసేందుకు ఎన్‌ఎస్‌జీ.... భారత వైమానిక దళం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోనుంది. జీ20 సభ్య దేశాల అధినేతల భేటీ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు దిల్లీలో అన్ని దుకాణాలు, కార్యాలయాలు, బ్యాంకులు మూసి ఉంటాయని దిల్లీ నార్త్ ఈస్ట్ జిల్లా డీసీపీ తెలిపారు. తన పరిధిలోని 70 శాతం సిబ్బంది జీ-20 సదస్సు భద్రత కోసం వెళతారని వివరించారు. 450 సత్వర స్పందన బృందాలతో పాటు విపత్తు నిర్వహణ యూనిట్లను దిల్లీలోని పలు ప్రాంతాలలో మోహరించనున్నట్లు తెలిపారు. విమానాశ్రయం, హోటళ్లు, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్ వద్ద 50 అంబులెన్సులతో పాటు అగ్నిమాపక శకటాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని చెప్పారు.
దిల్లీ పోలీసు విభాగానికి చెందిన మహిళా పోలీసులు కేంద్ర బలగాలతో పాటు విధులు నిర్వహించనున్నారు. వీరికి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు సహకారంతో నాలుగు వారాల పాటు కేరళ,మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వారిని మానసికంగా, శారీరకంగా దృఢంగా తీర్చిదిద్దారు. శిక్షణలో భాగంగా మహిళా కమాండోలకు అధికారులు ఆధునిక ఆయుధాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరిని దిల్లీలోని కీలక ప్రాంతాలలో మోహరించనున్నట్లు సమాచారం. అమెరికా నుంచి సీఐఏ, యూకే నుంచి ఎంఐ-6, చైనా నుంచి ఎంఎస్‌ఎస్ లాంటి సీక్రెట్ సర్వీసెస్ సంస్థలు వారివారి దేశాధినేతలకు రక్షణ కల్పించనున్నాయి.
ఇప్పటికే ఈ బృందాలు దిల్లీకి చేరుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మంగళవారం దిల్లీ పోలీసులకు చెందిన డాగ్ స్క్వాడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. లగేజీ, వాహనాలు, ప్యాకేజీల్లో ఉంచిన డమ్మీ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు దీనిని నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com