G20 Declaration 2023 : 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి
భారత అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు శనివారం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఆదివారంనాడు రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ముగిసేటప్పుడు డిక్లరేషన్‌ను విడుదల చేస్తారు. కానీ, మొట్టమొదటిసారి జీ20 డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరినట్లు సదస్సు ప్రారంభమైన తొలి రోజే ప్రకటించారు. జీ-20 న్యూదిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు పెద్ద తతంగమే జరిగింది. ఇందుకోసం భారత్ షేర్పా అమితాబ్ కాంత్, ఆయన బృందం విరామం లేకుండా శ్రమించింది.
వందల గంటల చర్చలు, అంతకుమించిన ద్వైపాక్షిక సమావేశాలతోపాటు 15 ముసాయిదాలు సిద్ధం చేసి....రెండుగా విడిపోయిన పశ్చిమ దేశాలు, రష్యా-చైనాల మధ్య ఏకాభిప్రాయం సాధించింది. జీ-20 శిఖరాగ్ర సమావేశాల డిక్లరేషన్‌పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు భారత షేర్పా అమితాబ్ కాంత్ సారథ్యంలోని దౌత్య బృందం పెద్ద కసరత్తే జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పేరాపై ఏకాభిప్రాయ సాధన కోసం తీవ్రంగా శ్రమించింది. 2వందల గంటలపాటు ఏకధాటి చర్చలు, 3వందల ద్వైపాక్షిక సమావేశాలతోపాటు 15 ముసాయిదాలు తయారు చేశారు. ఈ విషయాన్ని భారత షేర్పా అమితాబ్ కాంత్ వెల్లడించారు. జీ-20సదస్సులో తన బృందం విరామం లేకుండా పనిచేసినట్లు ప్రశంసించారు. మొత్తం జీ-20 సదస్సులో అత్యంత క్లిష్టమైన భాగం రష్యా-ఉక్రెయిన్‌కు సంబంధించిన భౌగోళిక రాజకీయ పేరాపై ఏకాభిప్రాయం సాధించటమే అని....అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియను 2వందల గంటల చర్చలు, 3వందల ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల తయారీతో ముగించినట్లు చెప్పారు. ఇందుకోసం ఇద్దరు తెలివైన అధికారులు తనకు సహకరించినట్లు అమితాబ్ కాంత్ చెప్పారు.
గత సంవత్సరంలో బాలీలో జరిగిన సదస్సులో, యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను గట్టిగా ఖండించారు. కానీ, ఆ తర్వాత జీ20 ప్లాట్‌ఫామ్‌పై రష్యాను ఖండించడంపై మాస్కో, చైనాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ తర్వాత జీ20 అధ్యక్ష బాధ్యతను భారత్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆతిథ్యమిచ్చే భారత్‌కు ఈ సదస్సు మేనిఫెస్టోపై అన్ని దేశాల నుంచి ఏకాభిప్రాయం పొందడం కష్టమేనని పలు కథనాలు వచ్చాయి. భారత్ నేతృత్వం కింద జరిగిన జీ20 ఆర్థిక మంత్రుల, విదేశాంగ మంత్రుల సదస్సుల్లో కూడా డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. యుక్రెయిన్‌పై రష్యా దాడిని అన్ని సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాలని పశ్చిమ దేశాలు కోరాయి.
కానీ, రష్యా, చైనాలు దీన్ని వ్యతిరేకించాయి. ఈ కారణంతో సంయుక్తంగా మేనిఫెస్టోను విడుదల చేయలేకపోయాయి. అయితే మొత్తానికి ఉక్రెయిన్ సంక్షోభం, వాతావరణ మార్పులపై విభేదాల వంటి సవాళ్ల మధ్య న్యూదిల్లీ డిక్లరేషన్‌ను జీ-20 శిఖరాగ్ర సదస్సు స్వీకరించేలా ఏకాభిప్రాయం సాధించటం ద్వారా భారత్ అతిపెద్ద విజయాన్ని అందుకుంది. జీ-20 సమావేశాల తొలిరోజే ప్రధాని మోదీ సభ్యదేశాల కరతాళ ధ్వనుల మధ్య ఈ విషయాన్ని ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com