Madvi Hidma: మావోయిస్ట్ ఉద్యమంలో ముగిసిన హిడ్మా శకం..

Madvi Hidma: మావోయిస్ట్ ఉద్యమంలో ముగిసిన హిడ్మా శకం..
X
ఎన్నో దాడులకు రూపశిల్పిగా పేరు..

ఇరవై ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగి, బస్తర్ ఏరియాను కంచుకోటగా మలుచుకున్న మాడావి హిడ్మా, ఆంధప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మోస్ట్ వాంటెండ్ మావోయిస్టుగా భద్రతాదళాలకు కొరకురాని కొయ్యగా మారిన హిడ్మాను ఎట్టకేలకు అంతమొందించారు. మావోయిస్టు ఉద్యమంలో అందరిది ఒక దారైతే, హిడ్మాది మరో ప్రత్యేకమైన శైలి. అతడి దాడులు భయంకరంగా ఉండేవి. అదే సమయంలో దాడుల వ్యూహరచన, భద్రతా బలగాలకు కూడా అంతుచిక్కేది కాదంటే అతిశయోక్తి కాదు.

బస్తర్ ఏరియాలోని గిరిజనులు మావోయిజం బాట పట్టడానికి ఇతడి స్పూర్తి కూడా ఒక కారణమే. అప్పటి వరకు మావోయిస్టు అగ్రనాయకత్వంలో ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఉండేవారు. హిడ్మా రాకతో ఇది మారింది. మావోయిస్టుల్లో అత్యంత కీలకమైన PLGA “బెటాలియన్ నం.1”కు కమాండర్‌గా ఎదిగాడు. ఇలాంటి ఓ కరడుగట్టిన మావోయిస్టు ఛత్తీస్‌గఢ్-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని దట్టమైన మారేడ్‌మిల్లి అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇతడితో పాటు భార్య రాజక్క, నలుగురు సన్నిహితులు కూడా హతమయ్యారు.

2010 ఏప్రిల్‌లో తాడిమెట్లలో 74 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ కాల్పుల ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. మావోయిస్టు-భద్రతా దళాల చరిత్రలో అత్యంత దారుణమైన దాడిగా దీనిని అభివర్ణిస్తారు. ఈ దాడికి ప్లాన్ చేసిన వ్యక్తి హిడ్మా అని భావిస్తారు. దీంతో పార్టీలో ఒక్కసారిగా హిడ్మా శకం మొదలైంది. మావోయిస్టు గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది.

2013లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్, ఇతర నేతలు, భద్రతా సిబ్బంది సహా 30 మంది మృతి చెందారు. దీని వెనక కూడా హిడ్మా హస్తం ఉందని అంతా నమ్ముతారు. ఈ దాడుల వల్లే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నుంచి మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో చేరాడు. బీజాపూర్, సుక్మా, దంతెవాడ, దక్షిణ బస్తర్ అంతటా మావోయిస్టుల కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు. 2017లో బుర్కపాల్ దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. విన్పాలో, టేకులగూడ దాడుల్లో 21 మంది మరణించారు.

16వ ఏళ్ల వయసులో ఉద్యమంలోకి:

బీజీపూర్ జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూవర్తి గ్రామంలో పుట్టిన హిడ్మా, తన 16వ ఏటనే మావోల ‘‘బాల్ సంగం’’ ద్వారా మావోయిస్టుల్లో చేరాడు. అసాధరణ గెరిల్లా వ్యూహాలు హిడ్మా అటాకింగ్ స్టైల్. ఇతడికి గోండి, హల్బీ, హిందీ, తెలుగు, కొంచె మరాఠీ భాషలు వచ్చు. విద్య లేకప్పటికీ సాంకేతికతను అందిపుచ్చుకున్నాడు. ఇతన వద్ద ఒక ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్, కొన్నిసార్లు కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు ఉంటాయని మాజీ సహచరులు చెబుతుంటారు.

ఇప్పటి వరకు భద్రతా బలగాలు ఆరుసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. ఈ ప్రయత్నాల్లో 100 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ప్రతీసారి హిడ్మా పోలీసుల్ని తప్పించుకున్నాడు. ఇతడికి నాలుగు నుంచి ఐదు దశల సెక్యురిటీ ఉంటుంది. ఇతడిని గుర్తించడం దాదాపుగా అసాధ్యంగా ఉండేది. పోలీసులు వద్ద 25 ఏళ్ల నాటి పాత ఫోటో మాత్రమే ఉండేది. తన దళంలోని ప్రతీ సభ్యుడిని నవ్వతూ మాట్లాడుతూ, గౌరవిస్తూనే, భయంకరమైన దాడులు నిర్వహించేవాడు. కేంద్ర కమిటీలో ఎదిగిన ఏకైక తెలంగాణేతర గిరిజనుడు ఈయనే.

ఇలాంటి క్రూర చరిత్ర ఉన్న, భయంకరమైన మావోయిస్ట్ నేత మారేడుమిల్లి అడవుల్లో హతమయ్యాడు . భారతదేశ మోస్ట్ వాంటెంట్ హిడ్మా హతంతో భద్రతా బలగాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇతడి చేతుల్లో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఈ రోజు ఒకింత ఉపశమనం లభించినట్లైంది. హిడ్మా హతం దేశంలో మావోయిజానికి పెద్ద మొట్టుగా అభివర్ణించవచ్చు.

Tags

Next Story