AMITH SHA: ఆయుధాలు వదిలి రాకపోతే చస్తారు: అమిత్ షా
జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతికి సిద్ధమే అని.. కానీ ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలి రాకపోతే భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా హెచ్చరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పది వేల మంది లొంగిపోయిన విషయాన్ని హోం మంత్రి గుర్తుచేశారు. తాము టెర్రరిజాన్ని అంతం చేశామని షా స్పష్టం చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఉగ్రవాదులతో చర్చలు జరపాలని అడుగుతున్నాయని అమిత్ షా అన్నారు. చర్చలు కావాలనుకుంటే ఆయుధాలు వదిలేసి రండి.. లేదంటే భద్రతా బలగాలు వెంటాడతాయని ఉగ్రవాదులను అమిత్ షా హెచ్చరించారు. మూడు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదం కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించి ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని పాతాళంలోకి తొక్కిపెట్టేవరకు విశ్రమించబోమని పునరుద్ఘాటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com