G20 సదస్సు వేదికగా భారత్‌ వ్యూహాత్మక అడుగులు

G20 సదస్సు వేదికగా భారత్‌ వ్యూహాత్మక అడుగులు
ఇంధన పరివర్తనకు పావులు కదుపుతున్న భారత్‌... జీవ ఇంధన కూటమి ఏర్పాటుపై దృష్టి....

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఇంధన భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఇంధన పరివర్తనకు భారత్‌ పావులు కదుపుతోంది. జీ-20 గ్రూప్‌ దేశాల కూటమి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారత్‌, జీవ ఇంధన కూటమి ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో జీవఇంధన కూటమి ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

ప్రపంచవేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ వారధిగా నిలవాలన్న లక్ష్యంతో జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టింది. ప్రపంచార్థికంలో 75 శాతం వాటా ఉన్న జీ 20 దేశాల ప్రతిష్టాత్మక సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్‌ పలు కీలక ఆశయాల సాధన దిశగా ముందుకు వెళుతోంది. ప్రపంచ ఇంధన పరివర్తనకు మద్దతుగా స్థిరమైన ఇంధనం అభివృద్ధిని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా భారత్‌ ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రతిపాదించింది. ఈనెల 9 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభమయ్యే జీ-20దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రపంచ జీవ ఇంధన కూటమిలో 15కుపైగా దేశాలు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌ ప్రతిపాదించే ఈ కూటమిలో చేరే దేశాల్లో అమెరికా, కెనడా, బ్రెజిల్‌ కూడా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ వ్యర్థాల ద్వారా తయారయ్యే ఏ ఇంధనాన్ని అయినా జీవఇంధనం అంటారు. మానవులు పురాతనకాలం నుంచి జీవఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు.


భారత్‌కు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం సవాల్‌ను విసిరింది. మధ్యవర్తిత్వ లక్ష్యాలను చేరే మార్గాన్ని క్లిష్టతరం చేసింది. జీ20 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలతో ఈ ఏడాది భారత్‌ వేదికగా జరిగిన G20 సమావేశాల్లో ఎక్కడా ఉమ్మడి ప్రకటన రాలేదు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ సదస్సుకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దేశాధినేతలు ఈ ప్రతిష్టంభనను అధిగమించకపోతే, చరిత్రలో తొలిసారి సంయుక్త ప్రకటన లేకుండా ఈ సదస్సు ముగిసే అవకాశం ఉంది. మాస్కోతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు, పశ్చిమదేశాలతో పెరుగుతున్న ద్వైపాక్షిక బంధాలు భారత్‌ను ఎటూ తేల్చుకోలేని విధంగా చేస్తున్నాయి. జీ20 సదస్సు సంపూర్ణ విజయంపై నీలినీడలు కమ్ముకున్నందున.. అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్య సమస్యలైన ఆహారం, ఇంధన అభద్రత, ద్రవ్యోల్బణం, అప్పులు, బహుపాక్షిక అభివృద్ధి, బ్యాంకుల సంస్కరణలపై భారత్‌ దృష్టిసారించింది. అందుకే జీ20ని మరింత విస్తరించేందుకు ఆఫ్రికన్‌ సమాఖ్యను జీ20లో భాగం చేయాలని భారత్‌ ప్రతిపాదనలు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story