Tech Layoffs: భారీ ఖర్చు చేసి మరీ ఉద్యోగులకు ఉద్వాసన..ఐటీ కంపెనీల స్ట్రాటజీ..

గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి.
కంపెనీలు ఇలా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తొలగిస్తున్న ఉద్యోగులకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తమ కంపెనీల ‘‘ఎంప్లాయర్ బ్రాండ్’’ని కాపాడుకోవాలని అనుకుంటున్నాయి. ఉద్యోగులను గౌరవంగా పంపడం ద్వారా మానవీయ కోణాన్ని చూపాలనుకుంటున్నాయి. లీగర్ రిస్క్ తగ్గడం కోసం సెవరెన్స్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో న్యాయ వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఖర్చుపెట్టినప్పటికీ, తర్వాతి కాలంలో జీతాల ఖర్చులు తగ్గిపోవడంతో కంపెనీలు లాభాలు మెరుగుపడుతాయని అనుకుంటున్నాయి. దీంతో పాటు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మానవవనరుల్ని తగ్గించి ఆటోమేటెడ్ ప్రాసెస్‌లకు మారడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
గ్లోబల్ ఐటీ కంపెనీలు భారీగా ఖర్చు పెట్టి ఉద్యోగుల్ని సాగనంపుతున్నాయి. ఉదాహరణకు దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ 20,000 మంది ఉద్యోగులను తగ్గించడానికి రూ. 1135 కోట్లు ఖర్చు చేస్తోంది. యాక్సెంచర్ గత 3 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సెవరెన్స్ ఖర్చు చేసింది. గూగుల్ 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించడానికి ఏకంగా 1 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా 2024-25లో 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అమెజాన్ 30,000 కార్పొరెట్ ఉద్యోగుల్ని తొలగించడానికి కూడా భారీగా ఖర్చు చేస్తోంది.
అయితే, దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కరుణ కాదని, రిస్క్ మేనేజ్మెంట్, కంపెనీలు ఇప్పుడు నష్టం భరిస్తే, భవిష్యత్తులో ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. ఏఐ కారణంగా పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందని, సెవరెన్స్ ప్యాకేజీ అనేది ఒక రకమైన ట్రాన్సిషన్ ఖర్చు మాత్రమే అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, కంపెనీలు భారీగా ఖర్చు పెట్టడం కూడా వ్యాపార వ్యూహమే అని చెబుతున్నారు. ఇప్పుడు, ఐటీ రంగంలో ఉద్యోగుల్ని సాగనంపడం కూడా పెట్టుబడి లాంటిదే అని అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

