Defamation Suit: ఆప్ ఎంపీపై సీఎం భార్య రూ.100 కోట్ల పరువు నష్టం దావా

Defamation Suit: ఆప్ ఎంపీపై సీఎం భార్య రూ.100 కోట్ల పరువు నష్టం దావా
X
సంజయ్ సింగ్‌పై కోర్టును ఆశ్రయించిన గోవా సీఎం భార్య

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌పై గోవా ముఖ్యమంత్రి భార్య రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావా వేయడం సంచలనంగా మారింది. దీనిపై నోటీసులు జారీచేసిన గోవా కోర్టు.. జనవరి 10లోగా సమాధానం ఇవ్వాలని ఎంపీని ఆదేశించింది. గోవాలో ప్రభుత్వ ఉద్యోగాలు పేరుతో యువత నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. దీంతో సీఎం సతీమణి సులక్షణ.. తన పరువుకు భంగం కలిగించేలా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంటూ నార్త్‌ గోవాలోని బిచోలిమ్‌ సివిల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆప్ నేత చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంజయ్‌ సింగ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని ఆమె అభ్యర్థించారు. అంతేకాదు, సోషల్‌ మీడియాలో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలగించేలా.. కించపరిచేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించాలని సులక్షణ కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన అడ్‌ హక్‌ సివిల్‌ జడ్జి.. ఆప్ ఎంపీకి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద సంఖ్యలో యువతను మోసం చేసి.. రూ.లక్షలు మేర వసూలు చేసినట్లు గోవా వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై వందల మంది బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

దీంతో కేసులు నమోదుచేసిన పోలీసులు.. కనీసం 18 మందిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో గోవా సీఎం సులక్షణకు సంబంధం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఇటీవల స్పందించారు. తన భార్య సులక్షణ సావంత్‌కు దీనిలో ఎటువంటి సంబంధంలేదని, ఈ అంశంపై పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.

ఈ కేసులను విచారణకు సిట్‌తో పాటు బాంబే హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గోవా డీజీపీ అలోక్ కుమార్‌కు కాంగ్రెస్ ఇటీవల మెమోరాండం ఇచ్చింది. ఈ వ్యవహారంతో గత 12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుంటోందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోపించింది.

Tags

Next Story