Ravi Naik: గోవా మాజీ సీఎం రవి నాయక్ కన్నుమూత

గోవా వ్యవసాయ శాఖ మంత్రి, ఆ రాష్ట్ర మాజీ సీఎం రవి నాయక్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆయన వయసు 79 ఏళ్లు. పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంట్లోనే ఆయనకు కార్డియాక్ అరెస్టు అయినట్లు చెబుతున్నారు. పోండా పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులుఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోండాలోని ఆయన ఇంటి వద్ద పార్దీవదేహాన్ని ఉంచారు. వేల సంఖ్యలో జనం ఆయనకు తుది నివాళి అర్పిస్తున్నారు. మాజీ సీఎం రవి నాయక్ మృతి పట్లు సీఎం ప్రమోద్ సావంత్ సంతాపం తెలిపారు. ఆయన చేసిన ప్రజాసేవ ఎన్నటికీ గుర్తిండిపోతుందన్నారు. గోవా రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని తన ఎక్స్ అకౌంట్‌లో సీఎం పేర్కొన్నారు.
పోండా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు, మార్కెయిమ్ అసెంబ్లీ స్థానం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున రాజకీయం సాగించారు. 1984లో పోండా నియోజకవర్గం నుంచి తొలిసారి ఆయన ఎంజీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1989లో మార్కెయిమ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోండా నియోజకవర్గం నుంచి 1999, 2002, 2007, 2017లో గెలుపొందారు. ఇక బీజేపీ టికెట్‌పై 2022లో విజయం సాధించారు.
గోవాకు రెండు సార్లు రవి నాయక్ సీఎంగా చేశారు. 1991 నుంచి 1993 వరకు ఆయన తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించారు. ఇక 1994లో అతి తక్కువ కాలం గోవా సీఎంగా చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు, అంటే కేవలం ఆరు రోజులు మాత్రమే ఆయన సీఎంగా చేశారు. 1998లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com