Google Doodle: వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్ పేరుతో ప్రత్యేక డూడిల్‌ను రూపొందించిన గూగుల్.

భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్‘ (Wildlife Meets Culture) డూడిల్‌ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్ వంటి పక్షులు, జంతువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రతినిధితం చేస్తూ కనిపిస్తాయి. గూగుల్ డూడిల్ వివరణ ప్రకారం, ఈ కళాఖండం భారత గణతంత్ర దినోత్సవాన్ని, జాతీయ గర్వాన్ని, ఐక్యతను గౌరవించే గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంగా జరుపుకుంటుందని తెలిపింది.
డూడిల్‌లో మంచు చిరుత లడాఖ్ సంప్రదాయ వస్త్రాలు ధరించి, చేతిలో రిబ్బన్ పట్టుకుని కనిపిస్తుంది. పక్కనే ఉన్న పులి సాంప్రదాయ వాద్యాన్ని పట్టుకుని కనిపిస్తుంది. అలాగే, దుపట్టాలతో అలంకరించిన నీలగిరి తహర్ ఇంకా మరికొన్ని జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ రోజు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై భారత సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించనున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు అలాగే మరికొన్ని సంస్థల నుంచి మొత్తం 31 టేబ్లూలు పరేడ్‌లో ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ అనేది సైనిక శక్తి, సాంస్కృతిక సంపదలతో కూడిన గొప్ప ప్రదర్శన. ఈ రోజు భారత ప్రజలందరికీ దేశభక్తిని, ఐక్యతను మరింత చాటే రోజుగా నిలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com