SOCIAL MEDIA: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్!

కర్ణాటక ప్రభుత్వం చారిత్రాత్మకమైన సంచలన నిర్ణయంతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల చిన్నారి మెదడులపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ సాహసోపేత అడుగు వేశారు. అపరిమితమైన ఇంటర్నెట్ వాడకం వల్ల పిల్లల వికాసం దెబ్బతినడమే కాకుండా వారిలో ప్రవర్తనా లోపాలు తలెత్తుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం, ఈ నిర్ణయం ద్వారా దేశంలోనే ఒక నూతన ఒరవడిని సృష్టించింది. డిజిటల్ వ్యసనం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి భావి పౌరులను రక్షించడానికి ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను రూపొందించింది. నేటి తరం పిల్లలు శారీరక వ్యాయామానికి, చదువుకు దూరమై సామాజిక మాధ్యమాల మాయాజాలంలో చిక్కుకుంటున్నారని, దీనివల్ల వారిలో ఒంటరితనం, ఆందోళన వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి, వారిని సైబర్ నేరాల నుండి కాపాడటానికి ఈ నిషేధం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఈ కీలక నిర్ణయంతో కర్ణాటక డిజిటల్ సంస్కరణల దిశగా సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది.
భారతదేశంలో ఇటువంటి విప్లవాత్మక చట్టాన్ని ప్రతిపాదించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక రికార్డు సృష్టించింది. గతంలోనే ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నియంత్రణ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి బడ్జెట్ సాక్షిగా దీనిని అధికారికం చేసింది. ది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో దీని అమలుకు సంబంధించి పటిష్టమైన విధివిధానాలు, చట్టపరమైన నిబంధనలు రూపొందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నిర్ణయం వెనుక లోతైన కసరత్తు, నిపుణుల సలహాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి నిరంతరం చర్చలు జరుపుతూ వచ్చారు. విద్యావేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే ఈ నిషేధానికి రూపకల్పన చేశారు. విద్యాసంస్థల్లో, ఇళ్లలో పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతున్న తీరుపై నిపుణులు అందజేసిన నివేదికలు ప్రభుత్వాన్ని ఆలోచింపజేశాయి. అందుకే సమాజ హితం కోరి ఈ కఠిన నిర్ణయాన్ని బడ్జెట్ ప్రసంగంలో భాగం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బాటలోనే నడుస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ను కర్ణాటక అనుసరించడం గమనార్హం. కేవలం స్మార్ట్‌ఫోన్ నియంత్రణ మాత్రమే కాకుండా, డిజిటల్ వేదికలపై పిల్లల భద్రతను నిర్ధారించడానికి సామాజిక బాధ్యతగా ఈ చర్యను చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్ నుండి పిల్లలను దూరం చేయడానికి ఇది ఒక గొప్ప పరిష్కారమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కర్ణాటక తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారే అవకాశం కనిపిస్తోంది. టెక్నాలజీ హబ్ అయిన బెంగళూరు వంటి నగరాన్ని కలిగి ఉన్న రాష్ట్రమే ఇటువంటి చర్య తీసుకోవడం వల్ల దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
