Delhi: జమిలి ఎన్నికలపై కేంద్రం ముందడుగు..

Delhi: జమిలి ఎన్నికలపై కేంద్రం ముందడుగు..
X
ఈ పార్లమెంట్ సెషన్‌లోనే జమిలి బిల్లు తీసుకొచ్చే యోచన

జమిలి ఎన్నికలపై కేంద్రం ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లును తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లును జేపీసీకి పంపి సంప్రదింపులు చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. అయితే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సెప్టెంబర్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని సెప్టెంబరు 2, 2023న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలతో సహా వివిధ వర్గాల నుండి సూచనలు, అభిప్రాయాలు సేకరించారు. తర్వాత కమిటీ తన నివేదికను మార్చి 14, 2024న సమర్పించింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ప్రభుత్వ ఉద్దేశం.

ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా, కాంగ్రెస్ ఇప్పటికే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లును వ్యతిరేకించడంలో ఇండియా బ్లాక్ పార్టీలు ఐక్యంగా ఉండే అవకాశం ఉంది.

కాగా.. ప్రతిపాదిత బిల్లుపై ఏకాభిప్రాయం సాధించాలని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్షుణ్ణంగా చర్చించడం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపవచ్చని సమాచారం. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేపీసీ చర్చలు జరపనుంది. అదనంగా, చర్చలకు సహకరించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను కూడా ఆహ్వానించవచ్చని సమాచారం.

Tags

Next Story