Onion Price: ఢిల్లీలో తగ్గనున్న ఉల్లి ఘాటు.. కిలో రూ. 25లే.

Onion Price: ఢిల్లీలో తగ్గనున్న ఉల్లి ఘాటు.. కిలో రూ. 25లే.
దేశ వ్యాప్తంగా ధరలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వ సన్నాహాలు

కొన్ని రోజులకు క్రితం వరకు టమాటా ధరలు పై పైకి ఎగబాకాయి. వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఇక ఇప్పుడిప్పుడే ధరలు దిగొస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో ఉల్లి ఘాటెక్కిపోతోంది. దేశీయ మార్కెట్లలో ఉల్లి సరఫరాను పెంచేందుకు ఎగుమతులపై 40శాతం సుంకాన్ని విధించిన కేంద్రం, తాజాగా దిల్లీప్రజలకు రాయితీపై అందించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి కిలో ఉల్లిని 25 రూపాయలకు విక్రయించనున్నట్లు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య వెల్లడించింది.

ఇప్పటికే టమాటాలను విక్రయిస్తున్న ఎన్ సీసీఎఫ్ బఫర్ నిల్వల నుంచి ఉల్లిని కూడా రాయితీపై సరఫరా చేయనుంది. ఢిల్లీలో రేపు సుమారు 10 మొబైల్ వ్యాన్‌లు దీని కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. రెండు రోజుల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , అసోం, హిమాచల్ ప్రదేశ్ లో ఉల్లి విక్రయాలు మొదలుపెట్టనున్నారు. పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకొని 3లక్షల టన్నుల ఉల్లిని ఈ ఏడాదికి బఫర్ నిల్వగా ఉంచిన కేంద్రం 2లక్షల టన్నులు అదనంగా సేకరించాలని నిర్ణయించింది.


ఈ నెల 11 నుంచి కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి కూరగాయలను విడుదల చేయడం ప్రారంభించింది. సాధారణంగా లీన్ సప్లై సీజన్‌లో రేట్లు గణనీయంగా పెరిగినట్లయితే.. అవసరాలను తీర్చడానికి, ధరల స్థిరీకరణ కోసం బఫర్ స్టాక్ నిర్వహిస్తారు.. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరున్న మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లిపంట ఘోరంగా దెబ్బతిన్నది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో చాలినంత ఉల్లి అందుబాటులో ఉండట్లేదు. రాను రాను వాటి రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై భారీగా వడ్డన విధించింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం వర్తించనుంది.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఉల్లిపాయల సగటు రిటైల్ ధర శనివారం కిలోకు రూ.30.72గా ఉంది. మిజోరంలోని చంపాయ్‌లో గరిష్ట ధర కిలో ఉల్లి రూ.63 కు చేరింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్, బుర్హాన్‌పూర్‌లో అతి తక్కువ ధరలో కిలో ఉల్లిని రూ.10కి విక్రయిస్తున్నారు. క్రిసిల్ ఈ నెల ప్రారంభంలో తన నివేదికలో ఉల్లి సరఫరా తగ్గిన కారణంగా సెప్టెంబర్ ప్రారంభం నాటికి కిలో రూ.60-70కి చేరవచ్చని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story