Gujarat: పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం.. వేడుకల్లోనే వరుడు మృతి..

Gujarat: గుండెపోటు అనేది ఫలానా వయసువారికే వస్తుంది అని నిర్దేశించడం కష్టంగా మారింది. వయసుతో సంబంధం లేకుండా టీనేజర్ల నుండి వృద్ధుల వరకు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో కూడా గుండెపోటు రావచ్చు. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ ఇంట పెళ్లి వేడుక జరుగుతుంది. రెండు కుటుంబాలు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నాయి. పెళ్లికొడుకు ఇంట్లో బంధువులంతా ఆటపాటలతో సందడి చేస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు. పెళ్లికొడుకు కూడా వారితో పాటు చేరి ఆనందంగా చిందులేస్తున్నాడు. కానీ ఏమైందో తెలీదు ఉన్నట్టుండి అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.
అలా సూరత్‌కు చెందిన మితేష్ భాయ్ చౌదరి (33) తన పెళ్లి వేడుకల్లోనే గుండెపోటుతో మరణించాడు. అప్పటివరకు డ్యాన్స్ చేస్తూ సంతోషంగా గడిపిన మితేష్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అతడిలో ఏ చలనం లేకపోవడంతో అక్కడ ఉన్నవారంతా తనను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెళ్లికొడుకే మృతిచెందడం అందరినీ శోకంలో ముంచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com