Bridge Collapse: బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య..

ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో ఘోర దుర్ఘటన జరిగింది. వడోదర జిల్లాలోని పద్రా పట్టణ సమీపంలో గల మహిసాగర్ నదిపై నిర్మించిన 40 ఏళ్ల పురాత వంతెన బుధవారం ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే. గంభీర బ్రిడ్జిలోని కొంత భాగం నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజాగా 15కు పెరిగింది. ముగ్గురు వ్యక్తుల ఆచూకీ ఇంకా లభించలేదని జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు. ‘బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 15కు పెరిగింది. ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి’ అని తెలిపారు.
900 మీటర్ల పొడవున్న ఈ వంతెనలోని రెండు పిల్లర్ల మధ్య ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి నీటిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో ఆ స్లాబ్ మీద ఉన్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటోరిక్షా, మరో బైక్ నీటిలో పడిపోయినట్టు పేర్కొన్నారు. అప్పుడే స్లాబ్ చివరివరకూ వచ్చిన ఓ పెద్ద ట్యాంకర్ ప్రమాదకరంగా వేలాడిందని, మరో వాహనం కూడా ఇలాగే నిలిచిపోయిందని తెలిపారు. సెంట్రల్ గుజరాత్, సౌరాష్ట్రను గంభీర వంతెన కలుపుతుంది. తాజా ఘటనతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com