Dwaraka: సబ్‌మెరైన్‌లో వెళ్లి.. ద్వారక దర్శనం

Dwaraka: సబ్‌మెరైన్‌లో వెళ్లి.. ద్వారక దర్శనం
జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్న గుజరాత్ సర్కార్

శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్‌మెరైన్‌ టూరిజం’ ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని వీక్షించేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది క్రిష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్‌మెరైన్‌ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించింది. పర్యాటకులను సబ్‌మెరైన్లలో తీసుకెళ్లటం దేశ పర్యాటకంలో ఇదే మొదటిసారిగా ప్రభుత్వం పేర్కొన్నది. అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయాలను సబ్‌మెరైన్‌ నుంచి భక్తులు తిలకించవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహించనున్నామని పేర్కొన్నది. దీనికి సంబంధించి ‘మజ్‌గావ్‌ డాక్‌’ షిప్‌యార్డ్‌ కంపెనీతో గుజరాత్‌ టూరిజం శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ‘రెండు గంటలపాటు సబ్‌మెరైన్‌ యాత్ర ఉంటుంది. 300 అడుగుల లోతుకు వెళ్లి.. ఆనాటి ద్వారకను కనులారా చూసి రావొచ్చు. ఒక ట్రిప్‌లో 24 మంది పర్యాటకులకు తీసుకెళ్ళనున్నారు. పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్‌, గైడ్‌ కూడా ఉండనున్నారు. అరేబియా సముద్రం లోపల 300 అడుగుల వరకు ప్రయాణించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.


దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. హిందువులు పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారక ప్రముఖమైంది. భారతదేశానికి నలువైపులా నాలుగు ధామాలు ఉన్నాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథ క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరిజగన్నాథ క్షేత్రం, పశ్చిమాన ద్వారకపురి నగరం. ద్వారక పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరానికి ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వెళ్తుంటారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లడం లేదు. శ్రీకృష్ణుడు నిర్మించిన నగరాన్ని భక్తులు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకులు, భక్తులు ద్వారకా నగరం గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా జలాంతర్గామి సర్వీసులు రెడీ చేస్తోంది. ముంబయికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ మజాగాన్‌తో బీజేపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని భక్తులు, పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతన్నారు.

Tags

Read MoreRead Less
Next Story