Gujarat Government: ప్రేమ పెళ్ళి.. ఇకపై తల్లిదండ్రులకు తప్పక సమాచారం .. ఏ రాష్ట్రంలోనంటే ..

Gujarat Government: ప్రేమ పెళ్ళి.. ఇకపై  తల్లిదండ్రులకు తప్పక సమాచారం .. ఏ రాష్ట్రంలోనంటే ..
X
గుజరాత్‌లో ప్రేమ వివాహాలకు కొత్త నిబంధన

గుజరాత్‌లో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే జంటలకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఇకపై తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి ఉండాలనే నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు 'వివాహ రిజిస్ట్రేషన్ చట్టం'లో మార్పులు చేయనుంది. ఇది అమల్లోకి వస్తే, తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు.

ప్రతిపాదిత సవరణల ప్రకారం పెళ్లి చేసుకునే జంట తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారో, లేదో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తు అందిన 10 రోజుల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్వయంగా వధూవరుల తల్లిదండ్రులకు నోటీసులు పంపుతారు. దరఖాస్తుతో పాటు తల్లిదండ్రుల ఆధార్ వివరాలు కూడా జతచేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన 30 రోజుల తర్వాతే వివాహ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.

ఈ నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశాన్ని రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ అసెంబ్లీలో వివరించారు. "ప్రేమ పేరుతో జరిగే మోసాలను అరికట్టడం, అమాయక యువతులు 'లవ్ జిహాద్' బారిన పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం. మోసపూరిత వివాహాలు సామాజిక వ్యవస్థను చెదపురుగుల్లా నాశనం చేస్తున్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ప్రభుత్వ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో 'హాదియా కేసు'లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వారు గుర్తుచేస్తున్నారు. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు అని, ఇందులో తల్లిదండ్రులు గానీ, ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయని సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ నిబంధనలు కేవలం ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే, దీనిని కోర్టులో సవాలు చేసే అవకాశాలున్నాయి.

Tags

Next Story