Gurgaon: 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఒక్క భారీ వర్షం గురుగ్రామ్‌ను అతలాకుతలం చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. ఇక సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే ఉద్యోగులంతా నరకయాతన అనుభవించారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు కదలేని పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు 7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీ-జైపూర్ హైవేపై ట్రాఫిక్ జామ్ 7-8 కిలోమీటర్ల వరకు స్తంభించిపోయింది. ట్రాఫిక్ జామ్‌లో 3 గంటలకు పైగా ప్రజలు చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అన్నట్టుగానే వర్షం దంచికొట్టింది. ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఇక గురుగ్రామ్ హైవేపై 7 కి.మీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఇళ్లకు వెళ్లే ప్రయాణికులంతా నరకయాతన అనుభవించారు. ఇక మంగళవారం కూడా భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని అధికారులు కోరారు. అలాగే పాఠశాలలకు కూడా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాసంస్థలకు అధికారులు ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు గురుగ్రామ్ నగరంలో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇక భారీ వర్షాలు ఉన్నందున అన్ని ఫీల్డ్ ఆఫీసర్లంతా సెప్టెంబర్ 5 వరకు ప్రధాన కార్యాలయాల్లోనే ఉండాలని.. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com