Chief Election Commissioner: కొత్త సీఈసీ పేరు ఖరారు, రాష్ట్రపతికి సిఫార్సు చేసిన ఎంపిక కమిటీ

కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) పేరు ఖరారైంది. సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమైంది. ఒక పేరును ఖరారు చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ను నియమించనున్నట్టు సమాచారం.
భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేశ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి రెండు గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ) పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది.
ఈ కమిటీలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా ఎంపిక కమిటీ సోమవారం సాయంత్రం దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమైంది. సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్‌ను సీఈసీగా నియమిస్తుంటారు. దానినే కొనసాగిస్తూ.. రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జ్ఞానేశ్ సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నందున ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. సుఖ్‌బీర్ సింగ్ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్న విషయం తెలిసిందే.
జ్ఞానేశ్ ఎవరంటే ...
కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్...గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అధికరణం 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర వహించారు. కేంద్ర హోంశాఖలో అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శి (కశ్మీర్ డివిజన్). ఆ తర్వాత సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. జ్ఞానేశ్... సీఈసీగా 2029 జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 19న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీపై నిర్ణయాన్ని వాయిదావేయాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com