Gyanesh Kumar: సీఈసీ బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

Gyanesh Kumar: సీఈసీ  బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్
X
జనవరి 26, 2029 వరకు సీఈసీగా కొనసాగింపు

భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం నియమించింది. అర్ధరాత్రి సమయంలో ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని నిలదీసింది. ఇక ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం విచారణకు రానున్నాయి.

ఇక జ్ఞానేష్ కుమార్.. జనవరి 26, 2029 వరకు సీఈసీగా కొనసాగనున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ జ్ఙానేష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికలు ఆయనే పర్యవేక్షించనున్నారు. జ్ఞానేష్ కుమార్.. 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేశారు.

సీఈసీ, ఈసీ ఎంపికపై పెద్దఎత్తున దుమారం

కాగా, ఇప్పటి వరకూ సీఈసీగా ఉన్న రాజీవ్‌ కుమార్‌ పదవీ కాలం ఈనెల 18తో ముగియనుండటంతో అంతకంటే ఒక్కరోజు ముందు అంటే 17వ తేదీ సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమై జ్ఞానేశ్‌ కుమార్‌ పేరును ఖరారు చేశారు. అదేవిధంగా ఎలక్షన్‌ కమిషనర్‌గా వివేక్‌ జోషి పేరును ఖరారు చేశారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆయోదించారు. ఆ వెంటనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.

అయితే, సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ను, ఎన్నికల కమిషనర్‌గా (ఈసీ) వివేక్‌ జోషిని నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్లు ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది. సీఈసీ ఎంపికకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నేడు విచారణకు వస్తుందనగా కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయ లబ్ధికోసమే అధికార బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Tags

Next Story