Arvind Kejriwal: కేవలం 3 మామిడి పండ్లు మాత్రమే తిన్నా - కేజ్రీవాల్

Arvind Kejriwal: కేవలం 3 మామిడి పండ్లు మాత్రమే తిన్నా - కేజ్రీవాల్
తిండిపై ఈడీ రాజకీయం అంటూ విమర్శ

ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ఈడీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను జైలులో తింటున్న ఆహారంపై ఈడీ చిల్లర మల్లరగా వ్యవహరిస్తున్నదని, రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. తన వైద్యుడు రూపొందించిన డైట్‌ చార్ట్‌కు అనుగుణంగానే తాను ఆహారాన్ని స్వీకరిస్తున్నానని చెప్పారు. మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందిస్తూ, కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వడం లేదనే ఆరోపణలపై వైద్య నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

అనారోగ్య కారణాలను సాకుగా చూపి బెయిల్‌ పొందేందుకు కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారన్న ఈడీ ఆరోపణలపై కేజ్రీవాల్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. ‘బెయిల్‌ పొందడానికి నేను పక్షవాతం రిస్క్‌ తీసుకుంటానా? నేను ఏం తిన్నా, అది నా అరెస్ట్‌కు ముందు నా వైద్యుడు రూపొందించిన డైట్‌ చార్ట్‌కు అనుగుణంగానే తింటున్నాను’ అని కేజ్రీవాల్‌ చెప్పినట్లు కోర్టుకు తెలిపారు. ‘ఇంటి నుంచి పంపించిన 48 భోజనాల్లో కేవలం మూడుసార్లు మాత్రమే మామిడి పండ్లు పెట్టారు. ఈడీ ఆరోపణలు పూర్తిగా తప్పు’ అని కేజ్రీవాల్‌ తెలిపినట్లు సింఘ్వి కోర్టుకు చెప్పారు. ప్రతి రోజూ 15 నిమిషాలపాటు ఫిజిషియన్‌ను సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్‌ కోర్టును కోరారు. ఖైదీని అయినంత మాత్రానికి గౌరవప్రదంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు నాకు లేదా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ తింటున్న ఆహారం డైట్‌ చార్ట్‌కు అనుగుణంగా లేదని తెలిపింది. ఆయనకు గల మధుమేహానికి చికిత్స చేయడానికి తగిన వైద్య సదుపాయాలు తీహార్‌ జైలులో ఉన్నాయని చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. షుగర్‌ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్‌ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్‌ వైద్యుడు సూచించిన డైట్‌ చార్ట్‌ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇన్సులిన్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story