Haryana : ఇంటిముందు పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు..

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో హర్యానాలో ఓ కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. పంచకులలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై తిరిగివెళ్తూ కారులోనే విషం తాగి ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన పంచకుల సెక్టార్ 27లో వెలుగులోకి వచ్చింది. ఒక ఇంటిముందు పార్క్ చేసిన కారులో మృతదేహాలను గుర్తించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను డెహ్రాడూన్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్ (42), ఆయన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిగా గుర్తించారు. వీరంతా డెహ్రాడూన్ నుంచి పంచకులలో జరిగిన బాబాగేశ్వర్ ధామ్ హనుమంతుని కథ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చినట్లు తెలిసింది. కార్యక్రమం ముగిసిన అనంతరం డెహ్రాడూన్‌కు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభించింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అప్పుల భారమే ఈ ఆత్మహత్యలకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మృతదేహాలను పంచకుల లోని ప్రైవేటు ఆసుపత్రుల మార్చురీలకు తరలించారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ (లా అండ్ ఆర్డర్) అమిత్ దహియా సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com