Haryana: స్టేడియాలను జైళ్లుగా మార్చిన హర్యానా
కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా ప్రభుత్వం పలు మార్గాలను మూసివేసి.. భారీగా బలగాలను మోహరిస్తున్నారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజుల పాటు హరియాణాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే, పంజాబ్‌తో హరియాణా సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక బస్తాలు, ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా ఉంచారు. కొన్నిచోట్ల ఏకంగా సిమెంట్ కాంక్రీట్ చేస్తున్నారు. అలాగే, అల్లర్ల నిరోధక బలగాల వాహనాలు, వ్యాటర్ క్యానన్లను సిద్ధం చేశారు.
అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు హరియాణా ప్రభుత్వం సూచించింది. జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లోనూ రైతుల మార్చ్‌ను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నారు. అంబాలా, ఖైథల్, సోనీపట్, పంచకుల్‌లో 144 సెక్షన్ విధించారు. ఒకవేళ, ఆటంకాలను అధిగమించి, రైతుల మార్చ్ జరిగితే వారిని అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇందుకోసం రెండు స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చారు. సిర్సాలోని చౌధరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, దబ్వాలీలోని గురు గోవింద్ సింగ్ స్టేడియాలను జైళ్లుగా ఉపయోగించుకోనున్నారు.
రైతు నిరసనల్లో పాల్గొనకుండా ఖాప్ పంచాయతీలు, పలు గ్రామాల సర్పంచులతో పోలీసులు సమావేశాలు జరుపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ల నుంచి భారీగా రైతులు ఆందోళనకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. యూపీ, హరియాణాలతో తమ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 5 వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించారు. 2020-21లో రైతుల నిరసనలు సుదీర్ఘంగా కొనసాగిన సింఘు, గాజీపుర్, టిక్రీ సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com