IGP Puran Kumar: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఐజీ ఆత్మహత్య

హర్యానా రాష్ట్రంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చండీగఢ్‌లోని తన నివాసంలో ఆయన తన రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషాద ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
చండీగఢ్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (SSP) కన్వర్‌దీప్ కౌర్ అందించిన వివరాల ప్రకారం.. హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సెక్టార్ 11లోని తన ప్రభుత్వ నివాసంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. సీనియర్ అధికారి ఆత్మహత్యపై విస్మయం వ్యక్తం అవుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, లేక వృత్తిపరమైన ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
పురాణ్ కుమార్‌కు భార్య అమన్ పి.కుమార్ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి. అయితే ఈ విషాద సంఘటన జరిగిన సమయంలో ఆమె దేశంలో లేరు. అమన్ పి.కుమార్ అధికారిక పర్యటన నిమిత్తం జపాన్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉండగా.. ఈ విషయాన్ని ఆమె ఫోన్ చేసి చెప్పారు. అయితే రేపు సాయంత్రానికే ఆమె తిరిగి స్వదేశానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి అకస్మాత్తుగా మరణించడం ఉన్నతాధికారులను, పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పురాణ్ కుమార్‌తో సన్నిహితంగా మెలిగిన అధికారులు, సిబ్బంది ఆయన సేవలను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే ఆయన ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com