Haryana DGP Case Filed: హరియాణా డీజీపీ, ఎస్పీలపై కేసుకేసు

హర్యానా అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహతక్ ఎస్‌పీ నరేంద్ర బిజార్నియాలపై కేసు నమోదైంది. భారత న్యాయ సంహితతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద వీరిపై చండీగఢ్‌లోని సెక్టార్ 11 పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన భర్త ఆత్మహత్యకు వీరిద్దరూ ప్రేరేపించారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అన్మీత్ కుమార్ గురువారం ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 108 కింద ఆమె తన ఫిర్యాదును అందచేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్ట నిబంధనలు కూడా ఈ సెక్షన్‌లోకి వస్తాయి. తన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కొన్ని దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఈనెల 7న (మంగళవారం) చండీగఢ్‌లోని సెక్టార్ 11లోగల తన నివాసంలో కుర్చీలో కూర్చుని సర్వీస్ రివాల్వర్‌తో పేల్చుకుని పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. వీలునామాతోపాటు ఓ సూసైడ్ నోట్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో ఉద్యోగానికి సంబంధించి తాను ఎదుర్కొంటున్న సమస్యలు, అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com