Haryana Govt: మతం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే.. రూ. 4 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష..!

Haryana Govt: మతం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే.. రూ. 4 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష..!
X
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం..

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకునే వాళ్లపై మతమార్పిళ్ల నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కీలక ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి కోసం జరిగే మత మార్పిడులని ఈ చట్టం అడ్డుకుంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే సుమారు 4 లక్షల రూపాయల దాకా జరిమానాతో పాటు పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

అయితే, చట్ట ప్రకారం మత మార్పిడిలకి పాల్పడే వ్యక్తులు అధికారులకు దరఖాస్తు చేసుకొని, నిర్ణీత గడువుదాకా వేచి చూడాల్సి ఉంటుంది. బలవంతంగా, మోసపూరితంగా జరిగే మత మార్పిళ్లను రద్దు చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తుల మతస్వేచ్ఛను అడ్డుకోవడం హర్యానా సర్కార్ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని వెల్లడించింది.

చట్టంలోని శిక్షల వివరాలు..

మోసపూరితంగా పెళ్లి చేసుకుంటే: మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్న వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం రూ. 3 లక్షల జరిమానా విధిస్తారు. ఆ వివాహాన్ని రద్దు చేస్తారు.

మైనర్లు, మహిళలు, ఎస్సీ/ఎస్టీల మత మార్పిడి: వీరిని బలవంతంగా మతం మార్పిస్తే 4 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం రూ. 3 లక్షల జరిమానా ఉంటుంది.

సామూహిక మత మార్పిడి: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని ఒకేసారి మతం మార్పిస్తే 5 నుంచి 10 ఏళ్ల జైలు, రూ. 4 లక్షల జరిమానా విధిస్తారు.

సాధారణ అక్రమ మత మార్పిడి: ఇతర మోసపూరిత మార్పిడులకు పాల్పడితే 1 నుంచి 5 ఏళ్ల జైలు, రూ. లక్ష జరిమానా ఉంటుంది.

చట్టబద్ధమైన ప్రక్రియ ఇది..

చట్ట ప్రకారం మతం మారాలనుకునే వారు ముందుగా డిప్యూటీ కమిషనర్‌కు 'ఫారం-ఏ'లో డిక్లరేషన్ ఇవ్వాలి. మైనర్ల విషయంలో వారి తల్లిదండ్రులు 'ఫారం-బీ' సమర్పించాలి. మత మార్పిడి కార్యక్రమం నిర్వహించే మత గురువులు కూడా 'ఫారం-సీ' ద్వారా ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఈ నోటీసులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు అధికారులు విచారణ జరిపి, మోసం జరిగిందని తేలితే మత మార్పిడికి అనుమతి నిరాకరిస్తారు.

ఈ చట్టం కింద రద్దయిన వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఉంటుందని, తల్లిదండ్రుల ఆస్తిపై వారసత్వ హక్కులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags

Next Story