Russia- Ukraine war: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో భారతీయుడి మృతి

Russia- Ukraine war: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో భారతీయుడి మృతి
X
మృతుడు 22 ఏళ్ల రవి మౌన్

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఆర్మీ తరఫున పోరాడిన హర్యానా యువకుడు మరణించాడు. 22 ఏళ్ల రవి మౌన్ యుద్ధంలో చనిపోయినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించినట్లు అతడి కుటుంబం తెలిపింది. హర్యానాలోని కైతాల్ జిల్లా మాటౌర్ గ్రామానికి చెందిన రవి ఈ ఏడాది జనవరి 13న ట్రాన్స్‌పోర్ట్‌లో ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడని సోదరుడు అజయ్ మౌన్ తెలిపాడు. దీని కోసం ఎకరం భూమిని విక్రయించి రూ.11.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. అయితే రవిని బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారని, జైలులో బంధిస్తామని బెదిరించి ఉక్రెయిన్‌ దళాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సరిహద్దుకు పంపారని ఆరోపించాడు.

కాగా, మార్చి 12 వరకు రవితో టచ్‌లో ఉన్నట్లు అతడి సోదరడు అజయ్‌ తెలిపాడు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో జూలై 21న మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసినట్లు చెప్పాడు. రష్యా యుద్ధంలో అతడు చనిపోయినట్లు రాయబార కార్యాలయం తమకు చెప్పిందన్నాడు. అలాగే మృతదేహాన్ని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష కోసం కుటుంబ సభ్యుల నమూనాలను రష్యా కోరినట్లు భారత ఎంబసీ సమాచారం ఇచ్చిందని వెల్లడించాడు. సోదరుడి మృతదేహాన్ని భారత్‌కు తెచ్చేందుకు అవసరమైన డబ్బు తమ వద్ద లేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో దీనికి సహకరించాలని ప్రధాని మోదీని అభ్యర్థించాడు.

మరోవైపు ఇటీవల ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. రష్యా ఆర్మీలో పని చేస్తున్న భారతీయులను త్వరగా విడుదల చేయాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ నుంచి భారతీయ పౌరులందరినీ త్వరగా విడుదల చేస్తామని రష్యా హామీ ఇచ్చింది.

Tags

Next Story