Haryana polls: హర్యానా ఎన్నికల షెడ్యూల్ మారింది..
హర్యానాలో పోలింగ్ తేదీని సవరించింది ఎన్నికల సంఘం. హర్యానలో అక్టోబర్ 1 కి బదులుగా అక్టోబర్ 5, 2024న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. దీంతో పాటు హర్యానా ఎన్నికల కౌంటింగ్ తేదీని అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8కి మార్చింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ తేదీని కూడా అక్టోబర్ 8కి సవరించింది కేంద్ర ఎన్నికల సంఘం.
బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గురు జంబేశ్వర్ స్మారకంగా అసోజ్ అమవాస్య పండగను ఘనంగా నిర్వహిస్తారు. అక్టోబర్ 2న జరిగే ఈ వేడుకలో హర్యానాతో పాటు, పంజాబ్, రాజస్థాన్‌కు చెందిన ఈ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పండుగలో పాల్గొంటారు. ఈ క్రమంలో తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్.. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగుతున్నాయి. ఇక్కడ 90 సీట్లు ఉన్నాయి. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com