Haryana : నేడు నామినేషన్ దాఖలు చేయనున్న వినేష్ ఫోగట్
దేశపు స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ రోజు నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించింది. వినేష్ ఫోగట్‌తో పాటు ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, సోనిపట్ లోక్‌సభ ఎంపీ సత్పాల్ బ్రహ్మచారి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ ట్వీట్ చేస్తూ.. ‘జులనా అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో ఈ ముఖ్యమైన సందర్భంలో నాతో చేరవలసిందిగా మీ అందరికీ వినయపూర్వకమైన అభ్యర్థన.’ అంటూ రాసుకొచ్చారు.
దేశంలోని స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా సెప్టెంబర్ 6 న తమ రాజకీయ యాత్రను ప్రారంభించారు. ఇద్దరూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంతకు ముందు కూడా, ఇద్దరు రెజ్లర్లు సెప్టెంబర్ 4న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిసినప్పుడు, వారిద్దరూ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వచ్చాయి. కానీ తొందరల్లోనే అది నిజమైంది. అయితే పార్టీలో చేరిన వెంటనే వినేష్ ఫోగట్‌పై విశ్వాసం వ్యక్తం చేసి ఆమెను రంగంలోకి దింపింది.
వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోలేకపోయింది. రజత పతకాన్ని కూడా అందుకోలేకపోయింది. ఒలంపిక్స్‌లో వినేష్ ఫోగట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వరుసగా ముగ్గురు రెజ్లర్‌లను ఓడించారు. ఆ తర్వాత దేశం మొత్తం ఆమెపై ఆశలు పెట్టుకుంది. బంగారు పతకం సాధిస్తున్నారని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే స్వల్పంగా బరువు పెరగడంతో, ఆమె పై అనర్హత వేటుపడింది. దీంతో ఆమె స్వర్ణం కల నెరవేరలేదు. ఒలింపిక్స్ తర్వాత వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించింది.
వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా 2023 సంవత్సరంలో బిజెపి అప్పటి ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో వీధుల్లో కనిపించారు. వారు చాలా కాలం పాటు నిరసన వ్యక్తం చేశారు. రెజ్లర్ సాక్షి మాలిక్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి రెజ్లర్లు ఢిల్లీ వీధుల్లో నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ ఈ రెజ్లర్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఈ రెజ్లర్లు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో భాగమయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com