Professor Arrested: విద్యార్థినులను లైంగికంగా వేధించిన.. కాలేజీ ప్రొఫెసర్ అరెస్ట్

ఎన్నో ఏళ్లుగా విద్యార్థినులపై లైంగిక ఘోరాలకు పాల్పడుతున్న ఓ కీచక ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినుల పట్ల నీచ ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఇటీవల పరారైన ప్రొఫెసర్ రజనీష్ కుమార్ (50)ను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. హాథ్రస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలో చీఫ్ ప్రొక్టర్‌గా పనిచేస్తున్న రజనీష్ కుమార్ విద్యార్థినులను లోబరుచుకొని.. దారుణాలకు ఒడిగట్టిన వీడియోలు తీస్తూ వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ వీడియోలు తీసుకొని అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. సేథ్ ఫూల్ చంద్ బగ్లా పీజీ కాలేజీలో భౌగోళిక ప్రొఫెసర్ అయిన 50 ఏళ్ల రజనీష్ కుమార్‌పై ఒక బాధిత మహిళ ఇటీవల అజ్జాత లేఖ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతోపాటు పలువురు విద్యార్థినులను అతడు లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. 59 వీడియోలు రికార్డ్ చేశాడని, వాటి ద్వారా అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేశాడని ఆ లేఖలో పేర్కొంది. విద్యార్థినులను అతడి బారి నుంచి కాపాడాలని వేడుకున్నది.
కాగా, స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రొఫెసర్ రజనీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యం కూడా అతడ్ని సస్పెండ్ చేసింది. నాటి నుంచి పరారీలో ఉన్న రజనీష్ కోసం పోలీస్ బృందాలు వెతికాయి. చివరకు ప్రయాగ్‌రాజ్‌లో అతడు ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు.
మరోవైపు 2008 నుంచి విద్యార్థినులను ప్రొఫెసర్ రజనీష్ కుమార్ లైంగికంగా వేధించినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. వెబ్‌క్యామ్ ద్వారా రహస్యంగా 65కు పైగా వీడియోలు రికార్డ్ చేశాడని చెప్పారు. మెరుగైన గ్రేడ్‌లు, ఉద్యోగ నియామకాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి లంచాలు తీసుకున్నాడని వెల్లడించారు. ఇలా పరిచయం పెంచుకున్న అమ్మాయిలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని పోలీస్ అధికారి తెలిపారు. అతడి దారుణాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com