హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో జలప్రళయం కళ్లముందు కనిపించింది. జాదోన్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన కుంభవృష్టితో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇవాళ హిమాంచల్ ప్రదేశ్‌లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మండి, సిమ్లా, బిలాస్‌పూర్ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేసింది. సిమ్లా-కాల్కా జాతీయ రహదారి కూడా వర్షాల దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైంది. ఈ మార్గం సిమ్లాను చండీగడ్‌తో కలుపుతుంది. దీనిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. మాన్, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్‌పుర్‌లో భవనాలు దెబ్బతిన్నాయి.
మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. చాలా రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రిషికేశ్-ఛంబా నేషనల్ హైవేను మూసివేశారు. హరిద్వార్‌లో గంగానది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. చమోలీ జిల్లాలోని త్రాలి, నందానగర్ ఘాట్ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితం అయ్యాయి. పిండర్, నందాకిని నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ మోటార్‌బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com