జూన్‌ వచ్చినా తగ్గని ఉష్ణోగ్రతలు

జూన్‌ వచ్చినా తగ్గని ఉష్ణోగ్రతలు
ఓ వైపు అకాల వర్షాలు కురుస్తున్నా పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది

జూన్‌ వచ్చినా సూర్య ప్రతాపం తగ్గడం లేదు. ఓ వైపు అకాల వర్షాలు కురుస్తున్నా పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం ఏ సమయానికి ఎలా మారుతుందో తెలియని పరిస్థితి. మరో వారం, పది రోజుల తర్వాతే వర్షాలు జోరందుకునే అవకాశం ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. రైతులు వాతావరణానికి తగినట్లుగా సాగు పనుల్లో మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వేసవి ప్రారంభంలో తక్కువ ఉష్ణోగ్రతలు న మోదయ్యాయి. బంగాళా ఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో అడపాదడపా వర్షాలు పడటంతో ఆకాశం రోజులపాటు మబ్బులు కమ్ముకుని ఉండేది. కానీ మే చివరి 15 రోజులతోపాటు ఈ నెలలో ఉష్ణోగ్రతలు సగటున 40 డిగ్రీలపైనే నమోద వుతున్నాయి. వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీలకు చేరువైంది. వేడిగాలులు, ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు.

మరోవైపు ఉత్తర కోస్తాలో పిడుగులు.. ఉరుములు, మెరుపుల హోరు.. ఈదురుగాలులు చుట్టేస్తున్నాయి. అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ గరిష్ఠంగా 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సాయంత్రానికి కొంత చల్లబడుతోంది. అక్కడ సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాష్ట్రానికి ఈ నెల 8వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇవాళ 213 మండలాల్లో, మంగళవారం 285 మండలాల్లో తీవ్ర వడగాలులు, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story