Heatwave warning: పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ

Heatwave warning: పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ
X
యూపీ.. ఢిల్లీలపై ప్రభావం

దేశంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో హీట్‌‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజులపాటు హీట్‌వేవ్ పరిస్థితులుంటాయని ఐఎండీ హెచ్చరించింది. జూన్ 22 నుంచి జూన్ 25 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో హీట్‌వేవ్ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక జూన్ 24, 25 తేదీల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా హీట్‌వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం వేడిగాలులు తగ్గుముఖం పడతాయని తెలిపింది.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ఐఎండీ విడుదల చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌తో సహా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Tags

Next Story