Mumbai Rains: జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని..

ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాఠశాలలకు బీఎంసీ సెలవు ప్రకటించింది. ఇక లోకల్ ట్రైన్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
గత శనివారం మొదలైన వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి నిరంతరాయంగా వాన పడుతూనే ఉంది. సోమవారం ఉదయం కూడా భారీ వర్షం కురిసింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని కుర్లా, సియోన్, కింగ్స్ సర్కిల్, హింద్మాతా, అంధేరి, పరేల్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దక్షిణ ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జేపీ రోడ్, మిలన్ సబ్‌వే, ఎల్‌బీఎస్ రోడ్‌లోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో కూడా భారీగా వర్షపునీరు ఆగిపోయింది. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రాబోయే కొన్ని గంటలు వర్షం ఇలాగే కొనసాగితే రైల్వే ట్రాక్‌లు మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కుర్లా స్టేషన్‌లోని సెంట్రల్ రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సెంట్రల్, హార్బర్ రైల్వే లైన్‌లలో స్థానిక రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం సెషన్‌లో పిల్లలను పాఠశాలల నుంచి సురక్షితంగా ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని ముంబై సంరక్షక మంత్రి ఆశిష్ షెలార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనను ఆదేశించారు.
రాబోయే కొన్ని గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉన్నందున పోలీసులు, పౌరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా నీటి ఎద్దడి సంఘటన జరిగితే అత్యవసర నంబర్‌కు సంప్రదించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com