నివర్ తుఫాన్ :‌ తమిళనాడులో వర్ష బీభత్సం

నివర్ తుఫాన్ :‌ తమిళనాడులో వర్ష బీభత్సం

నివర్ తుపాన్‌ తమిళనాడులో బీభత్సవం సృష్టిస్తోంది. తుపాన్ ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ స్థంభించింది. వర్షం కారణంగా చెన్నై ఎయిర్ పోర్ట్‌లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని చెంబరాంబక్కం సరస్సులో నీటమట్టం పెరిగింది. దీంతో రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత రిజర్వాయర్ గేట్లను తెరిచారు. భారీ వర్షాల కారణంగా చెన్నైలో ఇవాళ సెలవు ప్రకటించారు.

నివర్ తుపాన్ కారణంగా చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి.దీంతో ముంపు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు 24వేల మందిని అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలించారు. తుపాన్ కారణంగా పుద్దుచ్చేరిలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సీఎం నారాయణ స్వామి హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పుద్దుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ సైతం ప్రజలను ట్విటర్ ద్వారా అప్రమత్తంచేశారు.

నివర్ తుపాన్ తమిళనాడులోని కడలూరుకు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తుపానుగా మారి, రానున్న 12 గంటల్లో పెను తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు రాత్రి లేదా...రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశమున్నట్లు తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఆంధప్రదేశ్‌లోనూ తుపాను ప్రభావం కన్పిస్తోంది. రాష్ట్రంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

నివర్ ప్రభావం కారణంగా తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేణిగుంట గ్రామపంచాయితీ పరిధిలో కురిసిన వర్షానికి మర్రిగుంట చెరువు నిండుకుండను తలపిస్తోంది. దీంతో సమీపంలోని ఇళ్లు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షంతీవ్రత కారణంగా జనం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. వెంటనే రంగంలోకిదిగిన రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్ తన సిబ్బందితో ముంపు ప్రాంతాలకు చేరుకొని పరిశీలించారు. వారికి పునరావాసం, భోజన సదుపాయం కల్పిస్తామని హామి ఇచ్చారు. చెరువు తూముకు అడ్డంగా మట్టివేసి మూసివేయడాన్ని గ్రహించిన తహసీల్దార్... మట్టిని తొలగించి నీటిని వదిలే ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story