Uttarakhand: చార్ ధామ్ యాత్రికులకు ఇబ్బందులు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు రోడ్లపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉత్తరాఖండ్ కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే ఆగిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో ఉండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని స్థానిక వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమని ఈ విపత్తు నుంచి ఎలాగైనా బయట పడేయమని యాత్రికులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అకస్మాత్తుగా మంచు పడటం, కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, ఇలా రకరకాల విపత్తులతో ఇప్పటికే చాలా మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.
అలా అని భారీ వర్షాలతో ట్రాన్స్పోర్ట్ కి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జూన్ 23న కూడ కొండచరియలు విరిగిపడి వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో రోడ్డుపైనే వందలాది వాహనాలు నిలిచిపోయి యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com