Himachal Pradesh: భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం..

హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. క్లౌడ్‌బరస్ట్, ఆకస్మిక వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఏడాది జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాలు.. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బరస్ట్‌లు, ఇళ్లు కూలిపోవడం, నీటిలో మునిగిపోవడం, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల కారణంగా 133 మంది మరణించగా, రోడ్డు ప్రమాదాల్లో 124 మంది ప్రాణాలు కోల్పోయారు.
అత్యధికంగా మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 26 మంది మరణించారు. ఆ తర్వాత కాంగ్రాలో 28 మంది, చంబాలో 10 మంది, కులులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బిలాస్‌పూర్, కిన్నౌర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్, లాహౌత్-స్పితి, హమీర్‌పూర్, ఉనాలో కూడా మరణాలు సంభవించాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా మండి (21), చంబా (20), సిమ్లా (15), కాంగ్రా (12), కిన్నౌర్‌లో 12 మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటి వరకూ 331 మంది గాయపడ్డారు.
ఈ వర్షాలకు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. రోడ్డు, విద్యుత్ లైన్లు, నీటి సరఫరా పథకాలు వంటి ప్రజా మౌలిక సదుపాయాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. రూ.లక్షలు విలువ చేసే పంటలు నీటిపాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటం, వరదలకు రోడ్లు కొట్టుకుపోవడం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతీయ రహదారులు సమా 455 రోడ్లు బ్లాక్ అయ్యాయి. కులు జిల్లాలో 73 రోడ్లు మూసివేశారు. ఆ తర్వాత మండిలో 58, సిమ్లాలో 58 రోడ్లను అధికారులు మూసివేశారు.
విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. కులులో 145, సిమ్లాలో 63 సహా మొత్తం 681 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 182 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, వాతావరణ శాఖ అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com